
రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలోని మైసూరువారిపల్లె పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు దివిటి రామ్మోహన్ (50) దారుణ హత్యకు గురయ్యారు. శనివారం స్వగ్రామమైన శాంతినగర్‌లోని ఆయన ఇంటి వద్ద బయట వరండాలో కూర్చుని ఉండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు మాస్క్‌లు ధరించి కత్తులతో నరికారు.
రామ్మోహన్ భార్య విజయలక్ష్మి ఇంట్లోంచి బయటకు వచ్చేలోపే వారు ద్విచక్రవాహనంపై పరారయ్యారు. శాంతినగర్‌లో విజయలక్ష్మి అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. వీరికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులను పరామర్శించారు.
నిందితులు ఎంతటివారైనా, ఏపార్టీ వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఇరవై ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న రైల్వేకోడూరులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఐ విశ్వనాథ్‌రెడ్డికి సూచించారు. హతుడు గతంలో వివిధ చానళ్లలో విలేకరిగా పనిచేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ హత్య తానే చేశానని õపోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం.