సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎంపీ బోస్
డా.బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ: పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వాల నుంచి ఇప్పటివరకూ జరిగిన విషయాలను తెలియజేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి రూపొందించిన డాక్యుమెంటరీ సీడీలను రామచంద్రపురంలోని ప్రసన్న విఘ్నేశ్వర ఫంక్షన్ హాల్‌లో బుధవారం నాగిరెడ్డి, ఎంపీ బోస్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ పోలవరం రాష్ట్ర ప్రజల దశాబ్దాల కల అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రుల తరువాత పోలవరాన్ని నిర్మించాలని తలచి రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే మొదలు పెట్టింది దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు ప్రభుత్వంలో డయాఫ్రం వాల్‌ను ముందుగా మొదలు పెట్టి, దానికి కావాల్సి నిర్మాణాలు లేకుండానే పనులు చేయడం కారణంగానే డయాఫ్రం దెబ్బతిందని నాగిరెడ్డి స్పష్టం చేశారు.
దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం తన ప్రభుత్వంలోనే డ్యామ్ మొత్తం పూర్తయ్యిందని ఎంతో ఆర్భాటంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి వరకూ అన్ని పనులను శరవేగంగా చేసుకుంటూ ప్రస్తుతం డ్యామ్‌ను పూర్తి చేశారన్నారు. ఈసీఆర్‌ఎం డ్యామ్ పూర్తయిన వెంటనే లెఫ్ట్, రైట్ కెనాల్స్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
దివంగత రాజశేఖర్‌రెడ్డి మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసి గోదావరి పరివాహక ప్రాంత రైతులకు నీరు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వమే 78 శాతం పనులను పూర్తి చేసిందని చంద్రబాబు చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుల కారణంగా నేడు పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందన్నారు.
ఈ పనుల్లో కమీషన్లు పొందాలనే ఏకైక సంకల్పంతో చంద్రబాబు పని చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మూడు అథారిటీల ద్వారా టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు 78 శాతం పూర్తయ్యిందని చెప్పిస్తే, తామే ఒప్పుకుంటామని బోస్ అన్నారు. డాక్యుమెంటరీని తయారు చేసిన త్రినాథ్‌రెడ్డి మాట్లాడుతూ పోలవరం చరిత్ర, దాని నిర్మాణం ఎవరి హయాంలో ఏవిధంగా జరిగిందనే విషయాలను డాక్యుమెంటరీ ద్వారా తెలియజేశామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment