
పి–4 పేరుతో ప్రజలను యాచకులను చేయొద్దు
● గ్రామాల్లో ఎటు చూసినా సమస్యలే
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
● స్థానిక సమస్యలపై మొదలైన
ప్రజా చైతన్య యాత్ర
అమలాపురం టౌన్: సహజ వనరులను దోచుకుని కార్పొరేటర్లకు కట్టబెట్టడమే పి–4 అంతిమ లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పి–4 అమలుతో ప్రజలను యాచకులను చేయొద్దని సూచించారు. సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ వరకూ ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా చైతన్య యాత్రను శ్రీనివాసరావు మంగళవారం స్థానిక గడియారం స్తంభం సెంటరులో ప్రారంభించి ప్రసంగించారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు, పార్టీ నాయకుల సమక్షంలో శ్రీనివాసరావు తొలుత ఆ సెంటరులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. తర్వాత స్థానిక బుద్ద విహార్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి సైకిల్ యాత్ర పట్టణంలోని ఉప్పర కాలనీకి చేరుకుంది. అక్కడ ప్రజలతో సీపీఎం నాయకుల బృందం మమేకమై కాలనీ సమస్యలపై చర్చించింది. తర్వాత అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి, బండార్లంక తదితర గ్రామాల్లో సైకిల్ యాత్ర సాగింది. ఆయా గ్రామాల్లో ప్రజలతో ముఖ్యంగా ఉపాధి కూలీలతో పార్టీ బృందం మాట్లాడింది. జిల్లా ప్రజలకు సామాజిక న్యాయం కావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజా చైతన్యం పేరుతో తాము తిరుగుతున్న గ్రామాల్లో అనేక మౌలిక సమస్యలు తిష్ట వేసి పరిష్కారానికి నోచుకోవడం లేదని గమనించామన్నారు. తమ ప్రజా చైతన్య యాత్ర ద్వారా గ్రామ సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బాబు షూరిటీ– భవిష్యత్ గ్యారంటీ అంటూ నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేయడం ఒక్కటే కాదని, గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు సక్రమంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రజా చైతన్య యాత్రలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరామ్, ఆండ్ర మల్యాద్రి పాల్గొని ఆయా గ్రామ ప్రజలతో మమేకమై అక్కడ ప్రజా సమస్యలపై చర్చించారు. మంగళవారం ప్రారంభమైన ఈ యాత్ర ఈ నెల 28 వరకూ సాగుతుందని పార్టీ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు తెలిపారు.