
రేయింబవళ్లు ఇసుక దోపిడీ
● వ్యవస్థలను నాశనం చేస్తున్నారు
● బిల్లులు చెల్లించడంలో వివక్ష
● ప్రభుత్వం, అధికారుల తీరుపై
ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఆగ్రహం
కపిలేశ్వరపురం: కూటమి ప్రభుత్వం వచ్చాక కపిలేశ్వరపురం, తాతపూడి ఇసుక ర్యాంపులలో రాత్రింబవళ్లు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం బడ్జెట్ సమావేశంలో ఆయన ప్రభుత్వం, అధికారుల తీరును ఎండగట్టారు. ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు హాజరైన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నదీ పరరక్షణ నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇసుకను తవ్వేస్తున్నారని, విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారని, అందుకు అధికారులు వంత పాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మండలంలోని నేలటూరు, తాతపూడి గ్రామాల పరిధిలో ఆయా గ్రామల సర్పంచ్‌లు చేసిన అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులను తొమ్మిది నెలలుగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని కార్యదర్శిని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్యే ఏమైనా బిల్లులను చెల్లించొద్దని చెప్పారా అని, అలా చెప్పి ఉంటే తనకు లిఖితపూర్వకంగా రాసివ్వండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరి బిల్లులనూ ఆపమని చెప్పిన దాఖలాలు లేవని గమనించాలని అధికారులకు చురకలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల పింఛన్లను తొలగించేశారని, 9 లక్షల నూతన పింఛను దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారన్నారు. నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయడంలేదన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తోట అన్నారు.