Odisha Train Accident: బాంబు పేలిన శబ్దం వచ్చింది | - | Sakshi
Sakshi News home page

Odisha Train Accident: బాంబు పేలిన శబ్దం వచ్చింది

Published Sun, Jun 4 2023 11:00 AM | Last Updated on Sun, Jun 4 2023 11:01 AM

- - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం సిటీ: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన మూడు రైళ్ల ఘోర ప్రమాదం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఓ కుదుపు కుదిపేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు రాకపోకలు చేసేవారు ఇక్కడి నుంచి ఎక్కువే కావడంతో పలువురు దిగ్బ్రమ చెందారు. శనివారం తెల్లవారేసరికి మృతుల సంఖ్య తెలుసుకుని ఉలిక్కిపడ్డారు. ఈ ఘోర కలితో కదిలిపోయారు. కోరమాండల్‌కు రాజమహేంద్రవరం స్టేషన్‌లో హాల్టు ఉంది. ఇక్కడి నుంచే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలు భువనేశ్వర్‌, కోల్‌కతా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తూంటారు.

ఈ రైలులో వెళ్లిన తమ వారెవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, సురక్షితంగా ఉన్నారో లేదోననే ఆందోళన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పడింది. తమ బంధువులకు ఫోన్లు చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. సురక్షితంగా ఉన్నారన్న సమాచారంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌లోని అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలూ అందుబాటులో ఉండే విధంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను బాధితుల బంధువులెవరూ ఆశ్రయించలేదు.

తూర్పు గోదావరి కలెక్టర్‌ కె.మాధవీలత ఇచ్చిన సమాచారం ప్రకారం..
కోరమండల్‌లో రాజమహేంద్రవరం వచ్చేందుకు రిజర్వేషన్‌ చేయించుకున్న వారు :     31
సురక్షితంగా ఉన్న వారు :    24
ఫోన్లు పని చేయక ఆచూకీ
తెలియాల్సిన వారు :    7
యశ్వంత్‌పూర్‌ – హౌరా రైలులో
వెళ్తున్న వారు :    3 (అందరూ సురక్షితం) 

ఉమ్మడి ‘తూర్పు’ వాసులు సేఫ్‌
► తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నారు. రాజమహేంద్రవరానికి బాధితుడు మురళీకృష్ణ విశాఖపట్నం చేరుకున్నారు. మరో ఇద్దరు ప్రయాణికులు అనూప్‌కుమార్‌, అనామికా కుమారి కూడా రాజమహేంద్రవరం వచ్చేశారు.

► రాజమహేంద్రవరం సీతంపేటకు చెందిన దంపతులు హరిబాబు, అన్నపూర్ణ బంధువుల ఇంట శుభకార్యానికి భువనేశ్వర్‌ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారిద్దరూ అక్కడ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాల్సి ఉంది. అక్కడకు రాకముందే ఈ రైలు ప్రమాదానికి గురవడంతో వారు మరో మార్గంలో రాజమహేంద్రవరం బయలుదేరారు.

► కొవ్వూరుకు చెందిన పాలెంపాటి అప్పారావుకు ఈ రైలు ప్రమాదంతో సంబంధం లేదు. అతడు కోరమండల్‌ ఎక్కేలోపే ప్రమాదం జరిగిపోయింది. దీంతో అతను వేరే రైలులో రాజమహేంద్రవరం మీదుగా కొవ్వూరు చేరుకున్నాడు.

► కాకినాడకు చెందిన మరో వ్యక్తి కూడా సురక్షితంగా ఉన్నట్టు తెలిసింది.

రాజమహేంద్రవరానికి రిజర్వేషన్‌ చేయించుకుని మొబైల్‌ నంబర్‌ పని చేయక ఆచూకీ తెలియని ప్రయాణికులు
రాజవర్ధన్, ఆరాధ్య కుమారి,
డి.ఇందిరా కుమారి, డి.లోకేష్, బి.పంజా,
సుశాంత్, అభిషిక్త్‌ 

రైళ్ల రద్దుతో రద్దీ
ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రైల్వే అధికారులు శనివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ రద్దు చేశారు. దీంతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు ఏ రైలు వస్తే అందులో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. దీంతో రెండు గంటల పాటు రైల్వే స్టేషన్‌ కిటకిటలాడింది. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్‌ పొందిన ప్రయాణికులకు పూర్తి స్థాయిలో టిక్కెట్‌ డబ్బులు వాపసు ఇచ్చేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్‌లో జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌, స్టేషన్‌ మేనేజర్‌ గంగాప్రసాద్‌, సీటీఐ చంద్రమౌళి పర్యవేక్షించారు.

సమగ్ర దర్యాప్తు జరపాలి
ఈ రైలు ప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషనుకు శనివారం చేరుకున్న ఆయన అధికారులతో మాట్లాడారు. ఇక్కడి నుంచి ఎంతమంది కోరమాండల్‌ రైలుకు రిజర్వేషన్‌ చేసుకున్నారు, ఎంతమంది వివరాలు తెలిశాయి, ఆచూకీ తెలియని వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారో స్టేషన్‌ మేనేజర్‌ ఎం.గంగాప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. రైల్వేలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న దశలో ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ప్రమాదానికి కారణం సాంకేతిక సమస్యా లేక మానవ తప్పిదమా అనేది రైల్వే శాఖ సమగ్ర దర్యాప్తులో తేలుతుందన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో కూడా 98667 35454తో హెల్ప్‌ లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశానని చెప్పారు. కార్యక్రమంలో చీఫ్‌ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌళీచంద్ర, డిప్యూటీ టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణ్‌ ఆకుల, వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, సిటీ యూత్‌ ప్రెసిడెంట్‌ పీతా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హెల్ప్‌డెస్క్‌/కంట్రోల్‌ రూములు

రైలు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే ఆయా జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోలు రూములు ఏర్పాటు చేశారు. ప్రమాదంలో జిల్లా వాసులు ఎవరైనా ఉంటే ఈ నంబర్లలో సంప్రదించాలని ఆయా జిల్లాల కలెక్టర్లు కోరారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది, వీఆర్‌ఓలు, వలంటీర్ల ద్వారా ఆయా జిల్లాలకు చెందిన వారి సమాచారం సేకరించాలని ఆర్‌డీఓలు, తహసీల్దార్లను కలెక్టర్లు ఆదేశించారు.
రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌: 0883 – 2420541, 2420543

సామర్లకోట రైల్వే స్టేషన్‌: 73826 29990

తూర్పు గోదావరి కలెక్టరేట్‌: 89779 35609

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టరేట్‌: 08856 – 293104, 293198

కాకినాడ జిల్లా కలెక్టరేట్‌: 1800–425–3077

కాకినాడ జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూము: 94906 18506, 94949 33233

రద్దయిన రైళ్లు
విజయవాడ – రాజమహేంద్రవరం – విజయవాడ (07459/07460)

రాజమహేంద్రవరం – విశాఖపట్నం – రాజమహేంద్రవరం (07466/07467)

కాకినాడ – విశాఖపట్నం – కాకినాడ (17267/17268)

కాకినాడ – విజయవాడ – కాకినాడ (17258/17257)

గుంటూరు – విశాఖపట్నం – గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239/17240)

విశాఖపట్నం – విజయవాడ –విశాఖపట్నం ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701/22702)

బాంబు పేలిన శబ్దం వచ్చింది
మాది బిహార్‌. రాజోలు కామాక్షి కంపెనీలో పనిచేస్తున్నాను. ఇక్కడకు వచ్చేందుకు షాలిమార్‌లో కోరమండల్‌ ఎక్కాను. చీకటి పడుతూండగా ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దం వచ్చింది. బోగీ పల్టీలు కొట్టింది. ఏం జరిగిందోనని భయపడ్డాను. బయటకు వచ్చి చూస్తే రైలు ప్రమాదం జరిగింది. పట్టాలు తప్పిన బోగీలు చూసి టెన్షన్‌ పడ్డాను. తెగి పడిన కాళ్లు, చేతులు, మొండెం భాగాలను చూస్తే కడుపు తరుక్కుపోయింది.
– రాజేష్‌రామ్‌, రైలు ప్రమాద బాధితుడు

దేవుడే కాపాడాడు
నా కుమార్తెను తీసుకుని బెంగాల్‌లోని అసన్‌సోల్‌ వెళ్లాను. షాలిమార్‌ నుంచి రాజమహేంద్రవరం తిరిగి వచ్చేందుకు కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాను. రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పింది. పెద్దగా శబ్దం రావడంతో ఏమైందోనని ఆందోళన కలిగింది. బోగీలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయి. ఇంక బతకమేమో అనుకున్నాం. దేవుడే కాపాడాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాం. మరో ట్రైన్‌ ఎక్కి రాజమహేంద్రవరం పయనమయ్యా.
– యానాపు మురళీకృష్ణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement