మండపేట: మాంసాహార ప్రియులకు చుక్కలు చూపిస్తూ చికెన్ ధర కొండెక్కి కూర్చుంది. రికార్డు స్థాయిలో స్కిన్‌లెస్ కిలో రూ.400కు చేరింది. నాలుగు నెలలుగా సరైన ధర లేక నష్టపోవడం, పెరిగిన నిర్వహణ వ్యయం, అధిక ఎండలకు జడిసి కొత్త బ్యాచ్‌లు వేయడానికి కోళ్ల రైతులు వెనుకంజ వేస్తున్నారు. కోళ్ల లభ్యత తక్కువగా ఉండటంతో ధర పెరిగిపోతోంది.
మాంసాహార ప్రియులు చికెన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో రోజుకు సుమారు మూడు లక్షల కిలోల చికెన్ వినియోగిస్తుండగా, ఆదివారం, పండగ రోజుల్లో రెట్టింపు స్థాయిలో అమ్మకాలుంటాయి. రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు, అమలాపురం, రావులపాలెం, తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫామ్‌లు వరకు విస్తరించి ఉండగా ఏడు లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నట్టు అంచనా. బ్యాచ్ వేసిన 40 రోజుల్లో బ్రాయిలర్ కోళ్లు రెండు నుంచి రెండున్నర కేజీల వరకు పెరిగి వినియోగానికి వస్తుంటాయి. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ను బట్టి రైతులు ఎప్పటికప్పుడు కొత్త బ్యాచ్‌లు వేస్తుంటారు.
పెరిగిన ఖర్చులు
అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎండలకు జడిసి వేసవిలో కొత్త బ్యాచ్‌లు వేసేందుకు వెనకాడతారు. దీనికితోడు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ. 200కు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మేత ధరలు గిట్టుబాటయ్యేలా లేకపోవడం కొత్త బ్యాచ్‌లు వేయకపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. మొక్కజొన్న కిలో రూ.20 ఉండగా, సోయా రూ.50, అన్ని మేతలు మిక్స్ చేసి అమ్మే కంపెనీ మేత కిలో రూ.43 వరకు ఉంది. కోడిపిల్ల ధర రూ.26 నుంచి రూ.30 వరకు ఉంది.
కోడిమేత, మందులు, ఇతర నిర్వహణ ఖర్చులతో లైవ్ కిలో కోడి తయారవ్వడానికి రూ.110 వరకు వ్యయమవుతోందంటున్నారు. ఆయా కారణాలతో రెండు నెలలుగా అధికశాతం మంది రైతులు కొత్త బ్యాచ్‌లు వేయలేదు. సొంతంగా నిర్వహణ చేయలేక కమీషన్‌పై కోడిపిల్లలను పెంచి పెద్దవి చేసి ఇచ్చేందుకు బ్రాయిలర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల లభ్యత లేకపోవడం, అధికశాతం ఫామ్‌లు కంపెనీల అధీనంలోనే ఉండటం ధర పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.400 వరకు అమ్మకాలు చేస్తుండగా, లేయర్ కోడి రూ.130 వరకు ఉంది. సాధారణంగా రెండు నుంచి మూడు కిలోల వరకు బరువు పెరిగాక కోళ్లను మార్కెట్‌కు తరలిస్తుంటారు. కాగా 1.5 కిలో నుంచి 1.8 కిలో బరువున్న కోళ్లను అమ్మకాలు చేసేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెలాఖరు వరకు ధర తగ్గకపోవచ్చని వ్యాపార వర్గాలంటున్నాయి.
నష్టాలకు జడిసి
జనవరి నుంచి ఏప్రిల్ వరకు గిట్టుబాటు ధర లేక కోళ్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు గతంలో పోలిస్తే నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. ఎండలకు జడిసి చాలామంది కొత్త బ్యాచ్‌లు వేయక ధర పెరిగిపోతోంది.
– బొబ్బా వెంకన్న, బ్రాయిలర్ కోళ్ల రైతు, పెదపళ్ల, ఆలమూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment