మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పక్కాగా నిర్వహించి, సమన్వయం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతం చేయాలని కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ జిల్లాలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, డిఆర్‌ఓ టి.సీతారామమూర్తి, దేవదాయ, రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ , మత్స్యశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ నగరంలో, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వున్న శైవక్షేత్రాల్లో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు హాజరవుతారన్నారు. వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సీతానగరం మండలం వంగలపూడి నుంచి పట్టిసీమ వీరభద్రస్వామి దేవస్థానం, కొవ్వూరు గోష్పాద ఘాట్, రాజమహేంద్రవరం నగరంలో పుష్కర ఘాట్, మార్కండేయస్వామి దేవస్థానం ఘాట్, కోటిలింగాల ఘాట్‌కు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చెయ్యాలన్నారు. పట్టిసీమలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు, దర్శన సమాచారాన్ని అందించే విధంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చెయ్యాలన్నారు. అదే విధంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఘాట్‌లో అవసరమైన బోట్లతో పాటు గజ ఈతగాళ్ళను , పోలీసు సిబ్బందిని ఏర్పాటు చెయ్యాలన్నారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలోని శివాలయాల వద్ద, ప్రాంతాల్లో శానిటేషన్ పనులు చేయాలన్నారు. అన్ని ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్‌కు, అందుబాటులో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్న సందర్భంగా ప్రతి చోటా మహిళలకు ఇబ్బంది లేకుండా పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment