కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా గత ఏడాది మార్చిలో జరిగిన ప్రొఫెషనల్ అడ్వాన్స్‌మెంట్ టెస్ట్ (పీఏటీ) పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి పాస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణులైన వారు తమ హాల్ టికెట్లతో శుక్రవారం నుంచి తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
వసతి గదుల కార్యాలయం వద్ద ఫ్రీ వైఫై
అన్నవరం: జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇటీవల అన్నవరం దేవస్థానంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా డిజిటల్ పేమెంట్లకు ఫ్రీ వైఫై సదుపాయం కల్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వసతి గదుల కార్యాలయంలో అధికారులు ఫ్రీ వైఫై ఏర్పాటు చేసి, డిజిటల్ పేమెంట్లకు అవకాశం కల్పించారు. ఆ కార్యాలయం వద్దకు వచ్చిన వెంటనే సెల్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేయగానే సీఆర్‌ఓ రూముల బుకింగ్ అని వస్తుంది. దానిపై క్లిక్ చేయగానే వైఫై ఆన్ అవుతుంది. తద్వారా సత్యదేవుని సన్నిధిలో ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా వసతి గదులు పొందే అవకాశం భక్తులకు కలిగింది.
వాట్సాప్ గవర్నెన్స్‌లో
రిఫండ్ ఆప్షన్
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా ఇతర దేవస్థానాల్లో వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా మన మిత్ర పేరుతో అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్‌లో రిఫండ్ ఆప్షన్‌ను కూడా చేర్చారు. ఈ మేరకు రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గురువారం అన్ని దేవస్థానాలకూ సర్క్యులర్ జారీ చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దేవస్థానాల్లో వివిధ సేవలు, దర్శనాల టికెట్లు కొనుగోలు చేసిన కొనుగోలు చేసిన భక్తులకు ఏ కారణంతోనైనా వారి అకౌంట్ నుంచి నగదు కట్ అయి, టికెట్ రాకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు. ఇప్పటి వరకూ వాట్సాప్ గవర్నెన్స్‌లో ఈ ఆప్షన్ లేదు. నగదు కట్ అయి టికెట్లు రాని వారు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా సేవల టికెట్లు లేదా విరాళాల రశీదులు రాకపోతే భక్తులు ఆయా దేవస్థానాల్లోని హెల్ప్ డెస్క్ లేదా కాంటాక్ట్ పాయింట్‌లో ఫిర్యాదు చేయాలి. నగదు చెల్లించినట్లు ఆధారాలు చూపాలి. ఆ వివరాలను వాట్సాప్ గవర్నెన్స్ నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు పంపిస్తారు. బ్యాంకు పరిశీలన, నిర్ధారణ అనంతరం ఆ నగదును ఆ భక్తుని అకౌంట్‌కు జమ చేస్తారు. ఎటువంటి అవకతవకలకు ఈ మొత్తం వ్యవహారాన్ని రికార్డు చేయాలని, ఆడిట్ సమయంలో ఆడిట్ అధికారులకు సమర్పించాలని కమిషనర్ సూచించారు.
పీఠంలో లింగోద్భవ పూజలు
రాయవరం: మండలంలోని వెదరుపాక విజయదుర్గా పీఠంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ పూజలు ఘనంగా నిర్వహించారు. పీఠంలోని విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ పూజలు నిర్వహించారు. పీఠంలో ఉన్న ఎనిమిది ఈశ్వర బాణాలకు రాత్రి 11గంటల నుంచి శివుడు లింగరూపంలో ఉద్భవించిన సమయం వరకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, అభిషేకం, అర్చనలు తదితర పూజలు నిర్వహించారు. వేద పండితులు చీమలకొండ వీరావధాని, శ్రీనివాసావధానులు, తోలేటి నాగేంద్రశర్మ, చక్రవర్తుల మాధవాచార్యులు తదితర 18 మంది వేద పండితులు ఈ పూజలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి లింగోద్భవ పూజలను వీక్షించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. రాయవరం పార్వతీ సమేత రాజేశ్వరస్వామి, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి, సోమేశ్వరంలోని శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత సోమేశ్వరస్వామి, చెల్లూరులోని అగస్తేశ్వరస్వామి, వెంటూరులోని ఉమా సమేత సోమేశ్వరస్వామి, వెదురుపాక పార్వతీ సమేత సోమేశ్వరస్వామి, మాచవరంలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, పసలపూడిలో రాజరాజేశ్వరస్వామి ఆలయాల్లో లింగోద్భవ పూజలు భక్తుల శివనామస్మరణ నడుమ పురోహితులు నిర్వహించారు.
కొబ్బరి శాస్త్రవేత్తలకు టీమ్ అవార్డు
అంబాజీపేట: వివిధ పంటలపై ఆశించే పురుగులు, తెగుళ్ల సమర్ధ నివారణకు జీవ నియంత్రణ పద్ధతుల వినియోగంపై స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలకు టీమ్ అవార్డు లభించినట్టు కేంద్ర అధిపతి డాక్టర్ ఎన్.బి.వి.చలపతిరావు తెలిపారు. ఈ మేరకు గురువారం బెంగళూరులో జరిగిన రెండవ అంతర్జాతీయ జీవ నియంత్రణ సమావేశంలో ఈ అవార్డును ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్స్ రీ సోర్సెస్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. ఎస్.సుశీల్, పరిశోధనా కేంద్ర అధిపతి డాక్టర్ చలపతిరావుకు ప్రదానం చేశారు. కొబ్బరి, కోకో, పంటలపై పురుగులు, తెగుళ్లను జీవ నియంత్రణ పద్ధతులలో నివారిస్తూ, బదనికలను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేసినందుకు ఈ అవార్డు లభించినట్లు చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన ఇతర పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment