చంద్రబాబు ప్రభుత్వంపై 420 కేసు పెట్టాలి
● ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి
● ఇది మోసపూరిత బడ్జెట్
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి
అక్రమాలకు పాల్పడింది
● మాజీ ఎంపీ హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి, మోసం చేసినందుకు చంద్రబాబు ప్రభుత్వంపై 420 కేసులు పెట్టాలని, కూటమి సర్కార్‌ను బర్తరఫ్ చేయాలని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ మోసపూరితంగా ఉందని, గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చేదిగా లేదని అన్నారు. రైతన్నకు రూ.20 వేలు ఇస్తామన్నారని, అయితే, కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి దీనిని అమలు చేస్తున్నారని చెప్పారు. తల్లికి వందనం పథకం అమలుకు ఎంత ఖర్చవుతుంది, బడ్జెట్‌లో ఎంత పెట్టారనేది స్పష్టత లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ప్రతి మహిళకు నెలకు రూ.1,500, యాభయ్యేళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు, ఆటో డ్రైవర్లకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల భర్తీ హామీల ఊసే లేదన్నారు. ఎస్సీలకు రావాల్సిన పథకాలు అమలు చేయడం లేదన్నారు. ఉచిత ఇసుక కేవలం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకే అమలవుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన వారిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. గత జగన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేసిందన్నారు.
రాజ్యాంగం భావప్రకటనా స్వేచ్ఛ కల్పించిందని, మాట్లాడినంత మాత్రాన కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంత మాత్రం భావ్యం కాదని హర్షకుమార్ అన్నారు. అధికారంలోకి రాక ముందు కక్ష సాధింపులుండవని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి నిలబెట్టిన అభ్యర్థి తరపున రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకూ నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ డబ్బుల పంపిణీ జరగడం సిగ్గుచేటన్నారు. పవన్ కల్యాణ్ కాషాయ దుస్తులు వేసుకుని, ఇటువంటి పనులు చేయడం సరికాదని, అవి తీసివేయాలని అన్నారు. చంద్రబాబుకు తన పాలనపై నమ్మకం లేకో, తమను ప్రజలు నమ్మడం లేదనే అనుమానంతోనో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో తరగతి చదివిన వారికి కూడా పట్టభద్రుల ఓటు కల్పించారని, తాము దరఖాస్తు చేయించిన వేలాది మందికి ఓట్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ బయటకు తీస్తామన్నారు. చంద్రబాబు సర్వశక్తులూ ఒడినప్పటికీ తన తనయుడు జీవీ సుందర్ విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. కూటమి వద్ద డబ్బు ఉండొచ్చని, తమకు ప్రజాబలం, యువత బలం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment