నేటి నుంచి మంత్రి దుర్గేష్ జర్మనీ పర్యటన
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలోని పర్యాటక వనరులపై అవగాహన కల్పించి, ఈ రంగంలో పెట్టుబడులు రాబట్టేందుకు ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకూ జర్మనీలో పర్యటించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేటలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్మనీలోని టెర్లిన్ ఎక్స్‌పో సెంటర్ సిటీ వేదికగా ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ జరిగే ఐటీబీ బెర్లిన్–2025 పర్యాటక వాణిజ్య ప్రదర్శన(ఈ–ఇంటర్నేషనల్ టూరిజం బోర్స్)లో పాల్గొని, రాష్ట్ర పర్యాటక రంగంలో పెట్టుబడులు సాధిస్తామని చెప్పారు. ట్రావెల్ టూరిజం అభివృద్ధికి నిరంతర ప్రేరణనిచ్చే ఈ ట్రేడ్ ఫెయిర్‌లో 400 మందికి పైగా అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో 200 సెషన్లు, 17 థీమ్డ్ ట్రాక్స్ ప్రదర్శిస్తారని చెప్పారు. ప్రఖ్యాత హోటళ్లు, పర్యాటక బోర్డులు, టూర్ ఆపరేటర్లు, సిస్టమ్ ప్రొవైడర్లు, పరిశ్రమల ప్రతినిధులు, ట్రావెల్ ఎక్స్‌పర్ట్స్ పాల్గొంటారనని వివరించారు. ప్రధానంగా సాంకేతిక పరివర్తన (డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్), సుస్థిరాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెట్ ట్రెండ్స్‌పై ఈ సదస్సు జరుగుతోందన్నారు. వేగవంతమైన పర్యాటకాభివృద్ధికి సరికొత్త వ్యూహాలపై చర్చించి, అమలు చేసేందుకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని మంత్రి దుర్గేష్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో జనసేన రాజమండ్రి సిటీ ఇన్‌చార్జి అత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment