అగ్నిప్రమాదంలో రెండు కార్లు దగ్ధం
ఆలమూరు: మండలంలోని జొన్నాడ కారు గ్యారేజీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో కె.సురేష్ కార్ల గ్యారేజీ నడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆ గ్యారేజీ నుంచి హఠాత్తుగా మంటలు వెలువడి రెండు కార్లు ఒకేసారి దగ్థమయ్యాయి. ఆ సమయంలో గ్యారేజీలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. స్థానికుల ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన హైవే, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపకదళ సిబ్బంది సహకారంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కార్లను ఉద్దేశ పూర్వకంగా దగ్ధం చేశారా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో సుమారు రూ.ఐదు లక్షల వరకూ నష్టం వాటిల్లి ఉండవచ్చునని అగ్నిమాపకదళ సిబ్బంది అంచనావేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు కాలేదని ఎస్సై ఎం.అశోక్ తెలిపారు.
మహిళ ఆత్మహత్య
అమలాపురం టౌన్: భాగస్వామ్యంతో అద్దెకు తిప్పేందుకు కొనుగోలు చేసిన కారు ఇక తనకు దక్కదేమోనన్న మనస్తాపంతో ఓ మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. పట్టణ ఎస్సై తిరుమలరావు తెలిపిన వివరాల మేరకు అమలాపురం పట్టణం ముస్లిం వీధికి చెందిన అంకాల వల్లీ శ్రీదుర్గ (32) గురువారం సాయంత్రం ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గతంలో ఓ బ్యాంక్‌లో పనిచేసిన శ్రీదుర్గ, అదే బ్యాంక్‌లో పనిచేసే సాధనాల శివాజీ ఇద్దరూ కలిసి ఓ కారును కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ కారును అద్దెకు తిప్పుతున్నారు. అయితే తనకు కారు పని ఉందని శ్రీదుర్గ నుంచి కారు తాళాలు తీసుకున్న శివాజీ కారు ఇక ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడని ఎస్సై తిరుమలరావు తెలిపారు. కారు ఇక తనకు దక్కదేమోన్న మనస్తాపంతో శ్రీదుర్గ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రెడ్డి సతీష్ భార్య మృతి పట్ల విలపించారు. శ్రీదుర్గ తల్లి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుమలరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment