
హలీమ్.. రుచికి సలామ్
రంజాన్ స్పెషల్ డ్రింక్ తాగాల్సిందే..
హలీమ్ తిన్న తర్వాత స్పెషల్ రంజాన్ డ్రింకులను తాగకుండా వెళ్లలేరు. ఫ్రూట్ సలాడ్, ఫాలుడా, డ్రైఫ్రూట్ ఐస్‌క్రీమ్, షర్బత్, జీరా సోడా వంటి పానీయాలకు గిరాకీ ఎక్కువ.
● అరబ్బులు పరిచయం చేసిన వంటకం
● హైదరాబాద్ రుచులు అద్దిన ఏడో నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్
● నేడు ప్రపంచవ్యాప్తంగా ఇష్టమైన వంటకం
● తయారీకి సుమారు 10 గంటల సమయం
● హైదరాబాద్ తర్వాత రాజమహేంద్రవరం ప్రసిద్ధి
● స్పెషల్ అట్రాక్షన్‌గా రోటీకా రూమాల్
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఏటా రంజాన్ మాసంలో రాజమహేంద్రవరంలో సాయంత్రం 4 గంటలు దాటాక కులమతాలకతీతంగా, కుటుంబ సమేతంగా హలీమ్ షాపులకు రావడం పరిపాటిగా మారింది. ఒక్క రాజమహేంద్రరం వాసులే కాకుండా కోనసీమ, కాకినాడ, కొవ్వూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ హలీమ్ రుచి చూస్తున్నారంటే ఇదెంత ప్రసిద్ధి చెందిందో అవగతమవుతుంది.
నవాబుల కాలంలోనే..
హైదరాబాద్ ఆరో నవాబు మహబూబ్ ఆలీఖాన్‌కి అరబ్ దియాస్సార తెగకు సంబంధించిన వారు ఈ హలీమ్‌ని పరిచయం చేశారు. అప్పుడు హలీమ్‌లో నాలుగు రకాల దినుసులను మాత్రమే వాడేవారు. తర్వాత ఏడో నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తన వంట వారితో బిర్యానీలా, మరింత రుచికరంగా ఉండేలా దీనిని తయారు చేయాలని సూచించారు. దీంతో బిర్యానీకి వాడే దినుసులతో హలీమ్ రూపొందించబడింది. అంతకుముందు హలీమ్ కంటే ఇది రుచిలో మేటిగా, శక్తినివ్వడంలో మరింత మెరుగ్గా తయారైంది. అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి విదేశాలకూ ఎగుమతి కావడం మొదలైంది. అరబ్బు దేశం నుంచి వచ్చిన ఈ వంటకం.. కొత్త రుచులు సంతరించుకుని, తిరిగి అక్కడికే సరఫరా అవుతూండటం దీని విశేషం. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ వంటి 30 దేశాల ప్రజలు ఈ రుచిని ఆస్వాదిస్తున్నారు.
30 రకాల దినుసలతో..
అత్యధిక పోషకాలున్న ఆహారం ఇది. ఇందులో హై ప్రొటీన్స్, కేలరీలు పుష్కలంగా ఉన్నాయి. మూడు రకాల హలీమ్‌లున్నాయి. చికెన్ హలీమ్, మటన్ హలీమ్, వెజిటబుల్ హలీమ్ ప్రధానమైనవి. హలీమ్ తయారీలో స్వచ్ఛమైన నెయ్యి, వెన్న , గోధుములు, జీడిపప్పు, బాదం, పిస్తా, షాజీరా, యాలకులతో పాటు, సన్నగా తరిగి నేతిలో వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వంటి సుమారు 25 రకాల వివిధ రుచికరమైన వంట పదార్థాలను వాడుతారు.
హై హెల్దీ ఫుడ్
రుచిలోనే కాదు పోషక విలువల్లో సైతం హలీమ్‌కు సాటి ఏదీ లేదు. న్యూట్రిషియన్లు చెప్పిన మేరకు, ఇందులో హై ప్రొటీన్, క్యాలరీస్, కాల్షియం అత్యధికంగా ఉంటాయి. శరీరంలో లోపించే విటమిన్లను సమృద్ధిగా అందించే ప్రత్యేకమైన వంటకం హలీమ్. శారీరక శక్తి లోపించిన వారికి ఇది దివ్యౌషధం లాంటిది. అందుకే అంత కఠినమైన ఉపవాస దీక్ష చేసే ముస్లింలకు తక్షణ శక్తి కోసం హలీమ్‌ని సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్లార్ విందులో స్వీకరిస్తారు.
తయారీ ఇలా..
హలీమ్ తయారీ చాలా శ్రమతో కూడుకున్నది. ఇద్దరు మాస్టర్లు ఇటుకలతో తయారు చేసిన బట్టీలో మంట వద్ద 10 నుంచి 12 గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. మంటపై అంటు పట్టకుండా నిత్యం పొడవాటి చేతికర్రలతో గట్టిగా తిప్పుతూండాలి. ఏ మాత్రం అడుగంటినా దీని రుచి పాడవుతుంది. అందుకే ఇది సిద్ధం కావడానికి అన్ని గంటలు పడుతుంది.
రాజమహేంద్రవరం రావాల్సిందే..
ఒకప్పుడూ హలీమ్ పేరు చేపితే హైదరాబాద్ మాత్రమే గుర్తుకొచ్చేది. నేడు రాజమహేంద్రవరం కూడా దాని సరసన చేరింది. దానికి కారణం అక్కడి నుంచి వంట మాస్టర్లను తెచ్చి, అదే రుచి వచ్చేలా ఇక్కడి వ్యాపారులు ఎంతో కృషి చేశారు. రాజమహేంద్రవరంలోని జాంపేటలో సుమారు 20 షాపుల వరకు ఏర్పాటయ్యాయి. వీటిలో సుమారు 60 మంది మాస్టర్లు పనిచేస్తున్నారు. చికెన్ హలీమ్, మటన్ హలీమ్, వెజిటబుల్ హలీమ్‌ను తయారు చేస్తున్నారు. వీటిలో చికెన్, మటన్ హలీమ్‌లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చికెన్ హలీమ్ రూ.120 కాగా, మటన్ హలీమ్ రూ.160, వెజిటబుల్ హలీమ్ రూ.50కి విక్రయిస్తున్నారు.
సంథింగ్ స్పెషల్.. రూమాలీ రోటీ
ప్రత్యేకించి ఈ ఏడాది రంజాన్‌లో హలీమ్‌తో పాటుగా, రూమాలీ రోటీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ధాబాల్లో చిన్న రోటీలు లభిస్తాయి. ఇక్కడ పెద్ద సైజులో రోటీలను ఎక్కువగా నూనె వాడకుండా, బోర్లించిన పెద్ద బానపై కాల్చి ఇస్తారు. జాంపేటకు చెందిన మహ్మద్ అబ్దుల్లా షరీఫ్(పండు) దీనిని ఈ ఏడాది నగరవాసులకు పరిచయం చేశారు. మాస్టర్ షేక్ ఫయాజ్ తన విన్యాసాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. రోటీ పిండిని ముద్దగా చేసి, దానిని చేతితో పెద్దగా చేసి, గాల్లోకి ఎగరవేసిన తర్వాత, తిరిగి చేతపట్టుకుని బానపై వేసి కాలుస్తున్నారు. కొత్తగా ఉన్న దీని రుచి చూసిన భోజనప్రియుల ఆహా.. అంటూ లొట్టలేసుకుని తింటున్నారు. చికెన్ గ్రేవీ, మటన్ బోన్ గ్రేవీతో రూ.50 నుంచి రూ.80 వరకు విక్రయిస్తున్నారు.
శ్రమతో కూడుకున్నది
తయారీకి 10 నుంచి 12 గంటల వరకు పడుతుంది. తెల్లవారుజామున ప్రారంభిస్తే, సాయంత్రం 4 గంటలకు అందించగలం. పెద్ద పొయ్యి పెట్టి వాటిపై పెద్ద బానలు పెట్టి వంట చేస్తాం. ఒక్కో బానలో 10 కేజీల హలీమ్ తయారవుతుంది. 10 కేజీల చికెన్, 10 కేజీల మటన్, 10 కేజీల వెజిటబుల్ హలీమ్ తయారు చేస్తాం. మూడు తరాల నుంచి హలీమ్ తయారీలో ప్రావీణ్యం ఉంది.
– చాంద్, హలీమ్ తయారీదారు
తింటూంటే జివ్వుమంటుంది
ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్ముతున్న హలీమ్‌ను క్రమం తప్పడకుండా తింటున్నాను. దీని టేస్ట్‌కి మరేది సాటి రాదు. చికెన్ హలీమ్, మటన్ హలీమ్ చాలా టేస్టీగా ఉంటాయి. నోటిలో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. పేస్టు చేసినట్టుగా ఉండటంతో, నమిలి మింగాల్సిన అవసరం లేకుండా, గొంతులోకి ఇట్టే జారిపోతుంది. అందుకే రంజాన్ మాసంలో క్రమంతప్పకుండా తింటాను.
– ఎం.చిన్నా, రాజమండ్రి వాసి
దీని టేస్ట్‌కి ఎవ్వరైనా సలామ్ కొట్టి, గులామ్ కావాల్సిందే. ఒక్కసారి తింటే మళ్లీమళ్లీ తినాలపించే రుచి దీనిది. ఏడాదిలో ఒక్క రంజాన్ మాసంలోనే ఎక్కువగా లభిస్తుంది. ముస్లింలతో పాటు, వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఇష్టంగా తీసుకునే హై హెల్దీ ఫుడ్ ఇది. దీని పేరే హలీమ్. హైదరాబాద్‌లో ప్రసిద్ధిగాంచి, నేడు రాజమహేంద్రవరంలో అంతగా పేరు తెచ్చుకున్న వంటకం బహుశా ఇదే కావచ్చు. హైదరాబాద్ బిర్యానీ తర్వాత అంత ఎక్కువగా జిల్లావాసులు ఇష్టపడే వంటకం హలీమ్ అనడం అతిశయోక్తి కాదు.

హలీమ్.. రుచికి సలామ్
Comments
Please login to add a commentAdd a comment