ముస్లిం మైనార్టీలపై చిన్న చూపెందుకు బాబూ?
ఏపీ మైనారిటీ ఫైనాన్స్
కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ పదవి మైనారిటీలకు లేకుండా చేయడం ద్వారా ఆ వర్గానికి అన్యాయం చేశారని ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను సీఎం చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ ముస్లింలకు ప్రాధాన్యం దక్క లేదని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ముస్లిం, దూదేకులకు 13 కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చి వాటిలో 6 కేబినెట్ హోదా కల్పించారని గుర్తుచేశారు. శాసనమండలిలో వైస్ చైర్మన్ పదవితోపాటు రాష్ట్రంలో టాప్ 10 కార్పొరేషన్లలో ఇద్దరు ముస్లింలకు చోటు కల్పించారన్నారు. జనసేన దక్కించుకున్న కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఒక్కటి కూడా ముస్లిం మైనారిటీలకు కేటాయించకపోవడం గమనిస్తే మైనార్టీలపై పవన్ కల్యాణ్ వైఖరి అర్థమవుతోందన్నారు. ఆయనకు మైనారిటీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. జనసేన, టీడీపీలో ఉన్న మైనారిటీ నాయకులు సీఎం చంద్రబాబునాయుడితో మాట్లాడి.. బీజేపీ ప్రభుత్వం తీసుకోరాబోతున్న కుట్రపూరిత వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే విధంగా ఒత్తిడి తీసుకోని రావాలని ఆయన కోరారు.
సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయం ఏకాదశి పర్వదినం సందర్భంగా సోమవారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షలు ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు పుష్పార్చన నిర్వహించారు. ముత్యాల కవచాల అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతీ రోజు స్వర్ణాభరణాలు, వజ్ర కిరీటాలతో భక్తులకు దర్శనమిచ్చే స్వామి, అమ్మవారు ప్రతీ సోమవారం ముత్యాల కవచాలతోను, ప్రతీ గురువారం ఏ విధమైన ఆలంకరణలు లేకుండా నిజరూపంలో దర్శనమిస్తున్న విషయం తెలిసిందే.
ముస్లిం మైనార్టీలపై చిన్న చూపెందుకు బాబూ?
Comments
Please login to add a commentAdd a comment