మట్టి దొంగలెవరయా..?
కొవ్వూరు: చిడిపి గ్రామంలో గోదావరి లంకలో అక్రమార్కులు మట్టిని కొల్లగొట్టారు. కూటమి నేతల అండదండలతో.. అనధికారికంగా నదీగర్భంలో పొక్లెయిన్లను ఉపయోగించి, లారీల్లో భారీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికులు అక్కడకు వెళ్లి తవ్వకం పనులను అడ్డుకున్నారు. మట్టిని తరలిస్తున్న లారీలను, పొక్లెయిన్లను అడ్డగించారు. అనంతరం అధికారులకు సమాచారం అందించారు. తీరిగ్గా అధికారులు వచ్చే సమయానికి ఆ ప్రదేశంలో లారీలు, పొక్లెయిన్లు మాయమయ్యాయి. అక్రమంగా తవ్వి వదిలేసిన గోతులు మాత్రమే అక్కడ దర్శనమిచ్చాయి.
వాస్తవానికి ఈ భూములను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చిడిపి గ్రామానికి చెందిన 97 మంది పేదలకు పట్టాలుగా పంపిణీ చేశారు. దీంతో గ్రామస్తులు మట్టి తవ్వకం పనులను అడ్డగించి, తహసీల్దార్‌కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మట్టి తవ్వకానికి సంబంధించిన ఫొటోలనూ పంపించారు. అధికారులు సావధానంగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ గ్రామస్తులు అడ్డుకున్న లారీలు, పొక్లెయిన్లు మాయం కావడం చర్చనీయాంశమైంది. దీంతో టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై జి.శ్రీనివాసరావు, వీఆర్వోలు మట్టి తవ్విన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఏ విధమైన వాహనాలు లేనట్టు చెబుతున్నారు. ఫిర్యాదుదారులు అధికారులకు పంపిన ఫొటోల్లో, మీడియాలో ప్రచురితమైన ఫొటోల్లో లారీ నంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ అధికారులు మాత్రం వాహనాలపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారాన్ని ముందుగా ఫిర్యాదుదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వాటినే అధికారులకూ పంపించారు. తీరా విషయాన్ని సెటిల్మెంట్ చేసుకుని, ఏ విధమైన కేసుల్లేకుండా సహకరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు అధికారులు సైతం తమ వంతు సహకారం అందించినట్టు సమాచారం.
అక్రమ తవ్వకాలపై చర్యలేవీ?
తాళ్లపూడి మండలం బల్లిపాడు, కొవ్వూరు మండలం చిడిపి గ్రామాల మధ్య రెండు మండలాల సరిహద్దుల్లో ఈ తవ్వకాలు సాగుతున్నాయి. తమ పరిధి కాదంటూ ఒక మండలం అధికారులు మరో మండలం వారిపై నెట్టుకుంటూ, లోపాయికారిగా అక్రమార్కులకు సహకరిస్తున్నట్టు సమాచారం. అక్రమ తవ్వకాలు జరిగిన ప్రదేశంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వి, తరలించారన్నదీ లెక్క తేల్చాల్సిన అధికారులు, ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడాన్ని గ్రామస్తులు తప్పుపడుతున్నారు. రెవెన్యూ, టాస్క్‌ఫోర్స్ అధికారులు మట్టి తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించాక.. అసలు ఎవరి వాహనాలు తవ్వాయి, మట్టి తవ్వకాల వెనుక ఎవరున్నారు, ఎన్ని క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వారు, దాని విలువెంత, దానిని ఎవరి నుంచి రికవరీ చేయాలన్న అంశాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్టు చర్చించుకుంటున్నారు. కొందరు కూటమి నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి, ఈ అక్రమ బాగోతాన్ని సర్దుబాటు చేయడంపై జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల దేచెర్ల గ్రామంలో ఎర్రమట్టి తవ్వకాలపై మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ సమయంలో మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై వచ్చి, కొలతలు వేసి, అక్రమ తవ్వకాలు ఏ మేరకు సాగాయో నిర్ధారించారు. వాహనాలను సైతం సీజ్ చేశారు. తాజా వ్యవహారంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అధికారుల తీరుకు అద్దం పడుతోంది.
చిడిపిలో అక్రమ మట్టి తవ్వకాలు
వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు
సమాచారం ఇచ్చినా..
తాపీగా వచ్చిన అధికారులు
తవ్విన పొక్లెయిన్, లారీలు మాయం
కూటమి నేతల ఒత్తిళ్లకు
తలొగ్గిన యంత్రాంగం
అక్రమార్కులపై కానరాని చర్యలు
మాకు ఫిర్యాదు అందలేదు
మట్టి తవ్వకాలపై మాకు ఏ విధమైన రాతపూర్వక ఫిర్యాదు అందలేదు. మాకు అందిన సమాచారం మేరకు మట్టి తవ్విన ప్రదేశానికి వీఆర్వో సుబ్రహ్మణ్యం, టాస్క్‌ఫోర్స్ ఏఎస్సై జి.శ్రీనివాసరావును పంపించాం. పని ప్రదేశంలో వాహనాలు ఏమీ లేవు. ముందుగా ఫిర్యాదు చేసిన స్థానికులెవరూ స్టేట్‌మెంట్(వాంగ్మూలం) ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మైనింగ్ చేసిన ప్రదేశాన్ని టాస్క్‌ఫోర్స్ ఎస్సై, మైనింగ్ అధికారులు పరిశీలించారు. తదుపరి చర్యలు మైనింగ్ అధికారులు తీసుకోవాల్సి ఉంది.
– ఎం.దుర్గాప్రసాద్, తహసీల్దార్, కొవ్వూరు
మట్టి దొంగలెవరయా..?
Comments
Please login to add a commentAdd a comment