ఆనంద డోలిక.. హోలీ వేడుక
బిక్కవోలు: ఫాల్గుణ మాసం పౌర్ణమి. లేలేత చిగుళ్లు, విరబూసిన పూరెమ్మలు, చెట్లు వసంత రాగం ఆలపిస్తున్న తరుణంలో, చిన్నాపెద్దా తేడా లేకుండా, ఆనందోత్సాహాలతో జరుపుకొనే పండగ హోలీ. పురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ పండగను.. ముఖ్యంగా ఉత్తర భారతీయులు ఎంతో సంబరంగా చేసుకుంటారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఆనందోత్సాహాలతో ఈ సంబరాల్లో మునిగితేలుతున్నారు. పిల్లా, పెద్దా తేడా లేకుండా, రంగులు పులుముకొంటూ ఆనంద డోలికల్లో విహరిస్తున్నారు. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా..
పురాణ కథ
హోలీ పండగ వెనుక ఓ పురాణ కథ ఉంది. హోలీ అనే రాక్షసి పసిపిల్లల ప్రాణాలు హరిస్తూ కడుపు నింపుకొనేది. పిల్లల తల్లిదండ్రులు గర్భశోకంతో ఆగ్రహించి మూకుమ్మడిగా ఆ రాక్షసిని అంతమొందించారు. దాని మరణాన్ని వేడుకగా భావిస్తూ హోలీ పండగ నిర్వహిస్తారనేది కథనం.
ఆనందంతో పాటు ఆరోగ్యం
ఒకప్పడు పూలు, పండ్ల ద్వారా వచ్చిన రంగులనే వేడుకల్లో వాడేవారు. పండగకు ఒకరోజు ముందు అడవికి వెళ్లి మోదుగు పూలు సేకరించేవారు. వాటిని ఉడికించగా వచ్చిన ఎర్రటి ద్రావణంలో పసుపు, కుంకుమ కలిపి, ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంబరాలు జరుపుకొనేవారు. కాలక్రమంలో ఆ రంగులు పోయి, వార్నిష్, సింథటిక్ రంగులను చల్లుకోవడం ఆరంభించారు. అవి ప్రమాదకరమని తెలిసినా.. వాడుతూనే ఉండడం ఆందోళన కలిగించే విషయం. హోలీ ఆడటంలో జాగ్రత్తలు తీసుకోకతప్పదని చర్మ వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయన రంగులను కాకుండా, సహజసిద్ధ రంగులతో హోలీ జరుపుకోవడం ద్వారా చర్మానికి హాని జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సూచనలు పాటిస్తే మేలు
● పూర్వం ప్రకృతిలో దొరికే మొక్కలు, పూలతో తయారు చేసిన రంగులు చల్లుకోవడంతో చర్మ వ్యాధులు దరిచేరేవి కావు.
● రసాయన రంగులైన లెడ్ ఆకై ్సడ్, అల్యూమినియం, బ్రోమైడ్, మెర్క్యురీ సల్ఫేట్ వంటివి వినియోగించడం ఆందోళన కలిగించే విషయం. అవి కళ్లల్లో పడితే కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది.
● గులాల్ వంటివి వినియోగిస్తుండడం ప్రమాదకరమే. గులాల్ వంటి రంగులతో ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులు వస్తాయి.
● రసాయనాలు కలసిన రంగులతో హోలీ ఆడితే కనుక వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయరాదు. వెంటనే చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి.
● ఎరుపు, గులాబీ రంగులనే హోలీ కోసం వాడాలి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండటం వల్ల శరరంపై నుంచి సులభంగా తొలగిపోతాయి. గ్రీన్, ఎల్లో, ఆరంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా తొలగిపోవు.
● హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చరైజర్‌ని, తలకు నూనెను రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులువవుతుంది.
● ముఖంపై పడిన రంగులను శుభ్రం చేసుకోవడానికి సబ్బు కన్నా, క్లీన్సింగ్ మిల్క్ ఉత్తమమైనది.
● చాలా మంది రంగుల్లో వివిధ ఆయిల్స్‌ను కలుపుతారు. ఈ కారణంగా రంగులను శుభ్రం చేయడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. అందుకే రంగుల్లో ఆయిల్స్ లేదా నీటిని కలపకుండా హోలీ ఆడితే నీటి వృథాను అరికట్టవచ్చు.
జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యానికి మేలు
రసాయన రంగులకు దూరంగా ఉండాలి
జాగత్తలు పాటించకపోతే కళ్లకు ముప్పే..
సంబరాలకు సిద్ధమైన పిల్లలు, పెద్దలు
నేడే వసంతోత్సవం
చిన్న పిల్లలను దూరంగా ఉంచండి
చాలా మంది సరదా కోసం హోలీ పండగలో చిన్న పిల్లలు కూడా ఉండేలా చేస్తారు. కానీ చిన్న పిల్లలను దూరంగా ఉంచాలి. రంగులు వారిపై పడితే కంటి సమస్యలు, చర్మ వ్యాధులు, రంగులు నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కనుక వారిని జాగ్రత్తగా చూడాలి.
– పులగం రామానందసాగర్, వైద్యుడు, అనపర్తి
ఆనంద డోలిక.. హోలీ వేడుక
Comments
Please login to add a commentAdd a comment