ములికిపల్లి సర్పంచ్‌పై విచారణ
రాజోలు: అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ములికిపల్లి పంచాయతీ సర్పంచ్ గుబ్బల లక్ష్మీనీలిమ, ఆమె భర్త గుబ్బల రాజుపై పాలకవర్గ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం విచారణ జరిగింది. సర్పంచ్, ఆమె భర్త ఏకపక్ష నిర్ణయాలతో, తీర్మానాలు లేకుండా సుమారు రూ.3.28 లక్షల నిధులు దుర్వినియోగం చేశారని, పంచాయతీ పాత భవనం తొలగించడానికి బహిరంగ వేలం నిర్వహించకుండా, భవనం తొలగించి నిధులు పంచాయతీకి జమ చేయలేదని, పంచాయతీ చెరువులో వేలం వేయకుండా చేపలను విక్రయించారని, తమకు ఓటు వేయలేదనే అక్కసుతో మామిడిశెట్టి వారి గ్రూపులో జల్‌జీవన్ మిషన్‌లో తాగునీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని 12 అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. వార్డు సభ్యులు కె.శ్రీనివాస్, వైఎస్‌కే చైతన్య ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డీపీఓను కోరారు. డీపీఓ ఆదేశాల మేరకు సఖినేటిపల్లి ఈఓపీఆర్డీ కె.సూర్యనారాయణ, లక్కవరం పంచాయతీ కార్యదర్శి అబ్బాస్ ఆలీ ఈ విచారణ నిర్వహించారు. ములికిపల్లి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. 2021 నుంచి ఏడుగురు పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్, ఆమె భర్త ఆగడాలు భరించలేక వెళ్లిపోయారని విచారణాధికారులకు వివరించారు. రూ.7.45 లక్షలతో పారిశుధ్య సామగ్రి కొనుగోలు చేసినట్టు తప్పుడు రికార్డులు చూపించారని, పంచాయతీ ఫర్నిచర్‌ను సర్పంచ్ ఇంటికి తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు సోమిశెట్టి ధనలక్ష్మిని పంచాయతీ సమావేశాలకు ఆహ్వానించిన పంచాయతీ కార్యదర్శి ఓగూరి విజయభానుపై ఆగ్రహం వ్యక్తం చేసి, ఎంపీటీసీ సభ్యురాలిని పంచాయతీ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవాలని సర్పంచ్, ఆమె భర్త ఘర్షణ వాతావరణం సృష్టించారని అధికారులకు వివరించారు. ఈ విచారణ నివేదికను డీపీఓకు అందజేస్తామని ఈఓపీఆర్డీ సూర్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment