పొదుపు ఖాతాలో సొమ్ము మాయం
రెండు నెలల్లో దఫదఫాలుగా రూ.2.40 లక్షలు అదృశ్యం
ప్రత్తిపాడు: మహిళా శక్తి సంఘం పొదుపు ఖాతా నుంచి యూపీఐ ద్వారా సొమ్ము మాయమైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ నుంచి ఈ సొమ్ము మాయమైంది. ఆ గ్రామానికి చెందిన సదా శివ మహిళా శక్తి సంఘం (డ్వాక్రా గ్రూపు) పొదుపు ఖాతాలో జనవరి 14 నుంచి మార్చి 7 మధ్య దఫదఫాలుగా రూ.వెయ్యి నుంచి రూ.46 వేల వరకు 27 లావాదేవీల ద్వారా ఈ సొమ్ము కాజేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి సురక్ష, జీవన జ్యోతి యోజనలకు బ్యాంకు వారే రెన్యువల్ చేస్తారు. ఇందుకు పొదుపు ఖాతాలో కనీసం రూ.2 లక్షలైనా ఉండాలి. బ్యాంక్ మేనేజర్ లలిత్ ఈ పథకాలను రెన్యువల్ చేసేందుకు ఖాతాలను పరిశీలిస్తే, కేవలం రూ.760 ఉన్నాయి. దీంతో ఆయన డ్వాక్రా గ్రూపు సభ్యులకు సమాచారం అందించి, సైబర్ మోసం జరిగినట్టు గుర్తించారు. సదాశివ డ్వాక్రా గ్రూపు ఖాతా నుంచి రూ.2,40,180 యూపీఐ ద్వారా మోసం జరిగినట్టు వెల్లడైంది. దీంతో గ్రూపు అధ్యక్ష, కార్యదర్శులు కొట్టేటి పార్వతి, చింతల నాగమణి, ఇతర సభ్యులు ప్రత్తిపాడు వెలుగు ఏపీఎం వై.వెంకట్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఏపీఎం వెంకట్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment