ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ఎంఎస్ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా, వెబ్ ఆప్షన్లను జ్ఞానభూమి పోర్టల్‌లోని https://mdfc.apcfss.in వెబ్ పోర్టల్‌లో ఇచ్చారన్నారు. వెబ్ ఆప్షన్‌కు శనివారం వరకూ గడువు ఉందన్నారు. జిల్లాలో ఈ శిక్షణ ఇచ్చేందుకు రాజమహేంద్రవరంలోని స్వయంకృషి గురుకృపా ఎడ్యుకేషన్ సొసైటీని ఎంపిక చేశామని తెలిపారు.
‘నన్నయ’లో 17న
అంతర్జాతీయ సెమినార్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఆధ్వర్యాన ఈ నెల 17న అంతర్జాతీయ సెమినార్ నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. సెమినార్ బ్రోచర్‌ను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘కంట్రోల్ ఆఫ్ నిట్రోసామినేష్ ఇన్ ఫార్మస్యూటికల్స్ అండ్ అనలిటికల్ టెస్టింగ్’ అనే అంశంపై ఈ సెమినార్ జరగనున్నదని తెలిపారు. అమెరికాలోని సైజెన్ ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి, యూనివర్సిటీలోని కెమిస్ట్రీ అధ్యాపకుడు డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి, అమెరికాలోని కెమ్‌టెక్స్ లాబొరేటరీస్ సైంటిస్టు డాక్టర్ నరేష్ కటారి, మలేషియాలోని ఐఎన్‌టీఐ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్ వి.రవి, ఆంధ్రా యూనివర్సిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎస్.పాల్ డగ్లస్, ఎన్‌ఐటీ కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమరేంద్రరెడ్డి ఈ సెమినార్‌కు హాజరవుతారని వివరించారు. సెమినార్‌లో ప్రధాన అంశంపై విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధన పత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు.
15న జెడ్పీ సమావేశం
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం, బడ్జెట్ సమావేశం ఈ నెల 15న నిర్వహించనున్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు విధిగా హాజరు కావాలని కోరారు.
సరళం.. మొల్ల రామాయణం
రాజమహేంద్రవరం రూరల్: తెలుగులో రాసిన అనేక రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళమైనదని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. తొలి తెలుగు కవితా రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి జేసీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో మొల్ల రామాయణాన్ని రచించారన్నారు. ఈ కావ్యాన్ని ఆమె కేవలం ఐదు రోజుల్లో రాసినట్లు ప్రతీతి అని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో
స్వచ్ఛతా కార్యక్రమాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం ఆమె సమావేశం నిర్వహించారు. మెరుగైన పారిశుధ్య నిర్వహణ, స్వచ్ఛత గ్రామసభలు, ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇళ్లల్లో సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్ల నిర్మాణం – నిర్వహణ, పర్యవేక్షణ, నివేదికలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ ఎ.నాగ మహేశ్వరరావు, మండల అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment