దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
● కంచకచర్ల వద్ద రోడ్డు ప్రమాదం
● ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు
● ఒకే కుటుంబంలో ముగ్గురి దుర్మరణం
● మృతులు మండపేట వాసులు
తాడేపల్లిగూడెం రూరల్: దైవకార్యంలో పాల్గొనా లన్న సంకల్పంతో కుటుంబ సమేతంగా పొరుగు రాష్ట్రం నుంచి కారులో బయలుదేరారు. అయితే.. లారీ రూపంలో మృత్యువు వారిని మార్గం మధ్యలోనే కబళించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు, వారి ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఓ ఐటీ కంపెనీకి చెందిన హెచ్‌ఆర్ ఉద్యోగి భోగిళ్ల వెంకట సత్య సురేన్(37), తన భార్య నవ్య(35), కుమార్తె వాసుకి కృష్ణ(5), బంధువు కారులో కోనసీమ జిల్లా మండపేటలో జరగనున్న ఓ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయలుదేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై సత్యసురేన్ డ్రైవ్ చేస్తున్న కారు హైవే మెయింటెనెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, అతని భార్య నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసుకి కృష్ణ, బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసుకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఏఎస్సై పీవీకే దుర్గారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషాద ఛాయలు
మండపేట: కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మండపేటకు చెందిన భార్యాభర్తలు, ఐదేళ్ల చిన్నారి మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. హైదరాబాద్ నుంచి మండపేటకు వస్తూ వీరు ఈ దుర్ఘటనలో మరణించారు. సత్యసురేన్ తండ్రి భోగిళ్ల పాపారావు స్థానిక రావుపేటలో నివసిస్తున్నా రు. ఆయన బీమా కంపెనీ రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, సత్య సురేన్ చిన్నవాడు. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్‌లో ఉంటున్న ఈమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఆమె తండ్రి పాలచర్ల బాబ్జి మండపేటలో ఉంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
దైవ కార్యానికి బయలుదేరి.. తిరిగిరాని లోకాలకు
Comments
Please login to add a commentAdd a comment