చిడిపిలో కుల బహిష్కరణ ?
కొవ్వూరు: ఆధునిక సమాజంలో కొన్ని పల్లెల్లో నేటికీ కుల బహిష్కరణ దూరాచారం పడగ విప్పుతోంది. కొవ్వూరు మండలం చిడిపి గ్రామంలో రెండు వర్గాల మధ్య కార్చిచ్చు రేగింది. గ్రామంలో ఉన్న రజకుల చెరువు గట్టు ఆక్రమణ వ్యవహారంతో రజకులు, గౌడ సంఘం మధ్య వివాదం తలెత్తింది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో, ఒక వర్గాన్ని మరో వర్గం వారు బహిష్కరించే వరకు వెళ్లింది. ఒకే ప్రాంతంలో కొన్నేళ్లుగా కులమతాలకతీతంగా, అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న మిత్రులంతా ఇప్పుడు విరోధులుగా మారారు. రజకులతో మాట్లాడవద్దని, పెళ్లిళ్లు, విందులకు వెళ్లరాదని, మాట్లాడిన వారికి రూ.2 వేల జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ.200 బహుమానం ఇస్తామని గౌడ సంఘం తీర్మానం చేసినట్టు చెబుతున్నారు. చెరువు గట్టు ఆక్రమణలు తొలగించాలని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిని సక్రమంగా అమలు చేయని అధికారులపై చర్యలు కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని అనంతపురం జిల్లాకు చెందిన రజక సంఘ నాయకులు, న్యాయవాది హనుమన్న తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాకు విడుదల చేసిన వీడియోతో కుల బహిష్కరణ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అసలు వివాదం ఇదీ..
గ్రామాన్ని ఆనుకుని రజకులకు 1.24 ఎకరాల వృత్తి చెరువు ఉంది. దీని గట్టు ఆక్రమించుకుని కొందరు గడ్డిమేనులు వేశారు. గౌడ సంఘం చెరువు గట్టున పాపయ్య గౌడ విగ్రహాన్ని నెలకొల్పింది. చిన్న షెడ్డు వేసి, అందులో దేవీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రజకులు ఆక్రమణలపై కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులు కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. దీనిని గౌడ సంఘం అడ్డుకోవడంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని, ఆక్రమణలను అసంపూర్తిగా తొలగించి అధికారులు చేతులు దులుపుకొన్నారు. అప్పటి నుంచి ఆయా వర్గాల మధ్య చిచ్చురేగింది. చివరికి రజకులను బహిష్కరించి, వారి వద్ద నుంచి క్రయవిక్రయాలు సైతం మానేశారు. ఈ దురాచారంపై ఏ ఒక్క అధికారి కానీ, రాజకీయ పార్టీలు కానీ పట్టించుకోవడం లేదని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు గట్టు ఆక్రమణతో
రెండు వర్గాల మధ్య వివాదం
మాట్లాడితే రూ.2 వేల
జరిమానాకు నిర్ణయం
పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం
Comments
Please login to add a commentAdd a comment