దగా చేసిన కూటమి సర్కార్
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
● నల్లజర్లలో కార్యకర్తల సమావేశం
నల్లజర్ల: అధికారంలోకి రాకముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అమలు చేయలేని హామీలిచ్చి, గద్దెనెక్కాక వాటిని అమలు చేయకుండా కూటమి సర్కార్ ప్రజల్ని దగా చేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నల్లజర్లలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన శుక్రవారం రాత్రి జరిగిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమాన్ని అందించామన్నారు. వైఎస్సార్ సీపీ వారికి ఏ పథకాలూ ఇవ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఇవ్వడానికి, ఇవ్వకపోవడానికి ఇదేమన్నా బాబుగారి సొమ్మా అని ప్రశ్నించారు. పక్షపాతం, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడిలా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా కొనసాగించడం ధర్మమేనా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. ‘నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగాలు లేవు. మహిళలకు ఉచిత బస్సు లేదు. 50 ఏళ్లకే బీసీలందరికి పింఛన్ లేదు. తల్లికి వందనం లేదు. వృద్ధులు, వితంతువుల పింఛన్లలో కోత. దీనిపై ప్రతిపక్షం అడిగితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’ అంటూ చంద్రబాబు తీరును వేణు దుయ్యబట్టారు. ఏడాది పాటు సంక్షేమాన్ని ఎత్తేశారని చెప్పారు. నయవంచనకు పాల్పడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికి, ఇప్పటి పాలనకు మధ్య తేడాపై ప్రతి ఇంటా చర్చ జరగాలని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేశామని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ప్రభుత్వంతో పని చేయించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. ప్రజలకు మంచి జరగడానికి అందరం ఐక్యంగా ఉండి, వైఎస్సార్ సీపీ బలోపేతానికి కృషి చేద్దామని వేణు అన్నారు.
రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే టైమొస్తుంది
మరో ముఖ్య అతిథి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మండలంలోని పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో మనకు తగిలిన గాయాలను, కేసులకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే సమయం వస్తుందన్నారు. మండల, నియోజకవర్గ కమిటీల నియామకాలు పూర్తయ్యాయని, త్వరలోనే గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నికల వరకూ నిరంతరం పోరాడాలని అన్నారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చినా అందరూ స్పందించాలని కోరారు. 2019 నుంచి 2024 వరకూ వైఎస్ జగన్ అందించిన పాలనను, కూటమి ప్రభుత్వ పాలనను ప్రతి కుటుంబం, ప్రతి రోజూ బేరీజు వేసుకుంటోందని, జగన్‌ను తలవని కుటుంబం లేదని అన్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు సైతం జగన్ పాలననే తలుస్తున్నారన్నారు. పార్టీ శ్రేయస్సు కోసం ఐక్యతతో పని చేద్దామన్నారు. మనల్ని నమ్ముకున్న వారికి మంచి చేయడానికి మనమంతా తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చేంత వరకూ విశ్రమించకూడదని వనిత పిలుపునిచ్చారు. పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బంక అప్పారావు, నక్కా పండు, తాడిగడప శ్రీనివాసరావు, ముప్పిడి వెంకటనరత్నం, వామిశెట్టి పరమేశ్వరావు, కండెపు రామకృష్ణ, సర్పంచ్‌లు పల్లి జ్యోతి, గోతం సత్యలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు ముప్పిడి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు వామిశెట్టి పావనీ కుమారి, మాజీ ఎంపీపీ ఖండవల్లి కృష్ణవేణి, వైస్ ఎంపీపీ అచ్యుత శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో కొత్తగా ఏర్పడిన 18 కమిటీల అధ్యక్షులను సభకు పరిచయం చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దగా చేసిన కూటమి సర్కార్
Comments
Please login to add a commentAdd a comment