డెల్టాలకు నీరు విడుదల
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు శుక్రవారం 10,250 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,050, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,200 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.20 అడుగులు ఉంది.
వైభవంగా చక్రస్నానం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం ఘనంగా నిర్వహించారు. నరసింహస్వామితో పాటు అనంత పద్మనాభస్వామి, చక్రపెరుమాళ్ల స్వామి వార్లకు స్థానిక స్వామి వారి కోనేటిలో ఈ ఉత్సవం జరిపారు. రాత్రి 9 గంటలకు స్వామివారికి శేష వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. దేవస్థానం వద్ద ప్రారంభమైన ఈ కార్యక్రమం గ్రామంలోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. దేవస్థానం చైర్మన్ పరాశర రంగరాజభట్టర్, అన్నవరం దేవస్థానం అధికారులు, పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు.
నేటితో ఉత్సవాల ముగింపు
లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఈ నెల 9న ఇవి ప్రారంభమైన విషయం తెలిసిందే. చివరి రోజు శ్రీపుష్పయాగం నిర్వహిస్తారు.
జనసేన కార్యకర్తల గుండాగిరీ
పిఠాపురం: చిత్రాడలో శుక్రవారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్తలు గుండాగిరీ చేయడంతో సామాన్యులు బెంబేలెత్తిపోయారు. ట్రాఫిక్ నిలుపుచేసి, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అడిగిన సామాన్య ప్రయాణికులపై జనసేన జెండా కర్రలతో దాడి చేసి, గాయపరిచారు. మమ్మల్నే అడుగుతారా? అధికారం మాది.. అడిగితే చంపుతామంటూ బెదిరించి, కర్రలతో దాడి చేయడంతో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. దీనిని ఆపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం విమర్శలకు దారి తీసింది. మరోపక్క 216 జాతీయ రహదారిపై జనసేన కార్యకర్తలు బైక్‌లపై ప్రమాదకర ఫీట్లు చేస్తూ ప్రయాణికులకు చుక్కలు చూపించారు. వారిని కనీసంగా కూడా నిలువరించకపోవడంతో పోలీసులపై ప్రయాణికులు దుమ్మెత్తి పోశారు.
డెల్టాలకు నీరు విడుదల
Comments
Please login to add a commentAdd a comment