
వాడవాడలూ వాడపల్లివైపే..
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రానికి అత్యధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించే భక్తులతో ఆలయ ప్రాంగణం పోటెత్తింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో సుప్రభాత సేవతో సేవలు ప్రారంభించగా భక్తులు స్వామివారిని దర్శించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలర్లు ఏర్పాటు చేశారు. శనివారం స్వామివారికి వివిధ రూపాల్లో రూ. 42,59,486 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియంత్రించి, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది.

వాడవాడలూ వాడపల్లివైపే..
Comments
Please login to add a commentAdd a comment