ఉయ్యాల తాడే.. ఆమెకు ఉరితాడు
కాకినాడ క్రైం: అల్లారుముద్దుగా చూసుకుంటున్న తన బిడ్డను నిద్రపుచ్చేందుకు కట్టిన ఉయ్యాల తాడుతోనే.. ఆ తల్లి ఉరి వేసుకుని శాశ్వత నిద్రలోకి జారుకుంది. మద్యానికి బానిసైన భర్త వైఖరి.. అభంశుభం తెలియని ఇద్దరు బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందోననే ఆందోళన.. జీవితాన్ని ఎదురొడ్డలేనేమోనన్న నిస్సహాయత వెరసి.. ఎన్నో కలలుగన్న ఆ వివాహిత తన నూరేళ్ల జీవితాన్ని అర్థంతరంగా ముగించి తనువు చాలించింది. ఎన్నో కలలు చూపించి, ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తకు మద్యం ముందు భార్యాబిడ్డలు ఆనకపోవడంతో.. తమ మరణంతోనైనా భర్తకు కనువిప్పు కలుగుతుందనుకుంటూ తనకు తాను మరణ దండన విధించుకుంది. తన ఇద్దరు బిడ్డలకు తల్లి ప్రేమను శాశ్వతంగా దూరం చేసి, జీవితాంతం గుండెకోతను మిగిల్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన కొట్టేడు స్వాతి(26)కి 2017లో కాకినాడకు చెందిన తలాటం సురేష్‌తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. కార్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేష్ పెళ్లయిన తొలి నాళ్లలో భార్యతో బాగానే ఉండేవాడు. మద్యం అలవాటు శ్రుతి మించడంతో కొంతకాలం తర్వాత భార్యను పట్టించుకోవడం మానేశాడు. వీరికి నాలుగేళ్ల బాబు, ఎనిమిది నెలల పాప ఉన్నారు. నిత్యం మద్యం మత్తులో జోగుతూ, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న అతడి వైఖరితో స్వాతి తీవ్ర అసహనంతో ఉండేది. ఎంత నచ్చజెప్పినా సురేష్‌లో మార్పు రాలేదు. స్నేహితులతో కలిసి తాగుబోతులా మారాడని తల్లిదండ్రుల వద్ద స్వాతి బాధపడుతుండేది. ఈ క్రమంలో దంపతుల మధ్య వాదులాటలు జరిగేవి. ఆదివారం అర్థరాత్రి మద్యం తాగొచ్చిన సురేష్.. భార్యాపిల్లలు పడుకున్న గదిలో నిద్రపోయాడు. భర్త రాకను స్వాతి గమనించి, ఇంతేనా జీవితం అంటూ ప్రశ్నించింది. దీంతో సురేష్ భార్యతో గొడవ పడ్డాడు. ఇలాగే ఉంటే తమ పిల్లల సంగతేంటని ప్రశ్నించడంతో, సురేష్ తిరగబడ్డాడు. దీంతో విసుగెత్తిన స్వాతి సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. పిల్లల కోసం కట్టిన ఉయ్యాల తాడునే ఉరితాడుగా మార్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సోదరుడు నగేష్ ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి బానిసైన భర్త నిర్వాకంతో వివాహిత బలవన్మరణం
తల్లిని కోల్పోయిన చిన్నారులు
Comments
Please login to add a commentAdd a comment