అంధ విద్యార్థినికి వెలుగు రేఖగా..
కోటనందూరు: తల్లిదండ్రులు కడు పేదవారు. వారి కుమార్తె పుట్టుకతోనే అంధురాలు. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉన్న ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను ప్రభుత్వ బడుల్లోనే చదివిస్తున్నారు. చీకటి అలముకున్న బాలిక జీవితంలో ఓ ఉపాధ్యాయుడు కొత్త వెలుగులు నింపాడు. ఆమె విద్యాబుద్ధులను భుజాన వేసుకుని.. జీవితంలో నిలదొక్కుకునే వరకూ అండగా ఉంటానని భరోసా ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మండలంలోని బంగారయ్యపేట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కొమ్మాకుల వెంకట కుసుమదేవి పుట్టుకతోనే అంధురాలు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈమె ప్రస్తుతం బిళ్లనందూరు ఎంపీయూపీ పాఠశాల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. కోటనందూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దాడి కొండబాబు వర్క్ అడ్జస్ట్‌మెంటులో భాగంగా ఈ ఏడాది బిళ్లనందూరు పాఠశాలకు వెళ్లారు. అక్కడ వెంకట కుసుమదేవి వైకల్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఆయన తెలుసుకున్నాడు. దీంతో ఆమె చదువు బాధ్యతను కొండబాబు తన భుజాన వేసుకున్నారు. ఉన్నత చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించే వరకూ ఆర్థికంగా అండగా ఉంటానని సంకల్పించారు. ఇందులో భాగంగా బ్రెయిలీ లిపి నేర్చుకోడానికి అవసరమైన బ్రెయిలీ స్లేట్, స్టైలస్ తదితర మెటీరియల్ కొనిచ్చి, నేర్పిస్తున్నారు. బ్రెయిలీ నిపుణుల సహకారంతో కుసుమకు ప్రత్యేకంగా విద్యా బోధన చేస్తున్నట్టు కొండబాబు మాస్టారు వివరించారు. ఆ బాలికను ఉన్నత స్థితికి చేర్చేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్టు చెప్పారు. ఆ విద్యార్థినికి అండగా ఉంటూ, పలువురికి ఆదర్శంగా నిలిచిన కొండబాబు మాస్టారుని ఎంఈఓలు ఏవీఎస్ శ్రీనివాస్, ఎంవీ రామశేఖర్, ఎస్‌ఎంసీ కమిటీ సభ్యులు అభినందించారు.
చదువుకు దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు
జీవితంలో నిలదొక్కుకునే వరకూ
అండగా ఉంటానని భరోసా
Comments
Please login to add a commentAdd a comment