కాలువలో యువకుడి గల్లంతు
కడియం: మండలంలోని జేగురుపాడు వద్ద కాలువలో గెడ్డం కార్తీక్(19) గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల మేరకు, కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం తోకలంకకు చెందిన గెడ్డం కార్తీక్ రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం జేగురుపాడుకు చెందిన అతడి స్నేహితులను కలిసేందుకు వచ్చాడు. అనంతరం వారంతా కలిసి కాలువలో స్నానానికి దిగారు. అందరూ బయటకు వచ్చినప్పటికీ, కార్తీక్ రాలేదు. దీంతో స్థానికులతో కలిసి మిత్రులంతా గాలింపు చేపట్టినా, అతడి ఆచూకీ లభించలేదు. దీంతో కార్తీక్ తల్లిదండ్రులు, కడియం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్తీక్ ఆచూకీ కోసం కాలువ, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలిస్తున్నారు.
పంట కాలువలో మృతదేహం
ఉప్పలగుప్తం: అమలాపురం చల్లపల్లి ప్రధాన పంట కాలువలో సరిపల్లి గ్రామ పరిధిలో గుర్తు తెలియని పురుషుని మృతదేహం లభ్యమైందని ఎస్సై సీహెచ్ రాజేష్‌కుమార్ సోమవారం తెలిపారు. స్థానిక వీఆర్వో సమాచారం మేరకు, మృతదేహాన్ని వెలికితీశామని చెప్పారు. మృతునికి 50– 55 ఏళ్ల వయస్సు ఉంటుందని చెప్పారు. మృతుని వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
కడలి చెరువులో..
మామిడికుదురు: గోగన్నమఠం గ్రామ పరిధిలోని కడలి చెరువులో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయస్సు 40 ఏళ్లకు పైగా ఉండవచ్చు. ఈ మేరకు స్థానికులు నగరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సమీప పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను ఆరా తీస్తున్నారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
బిక్కవోలు: రామచంద్రపురం మండలం నేలపర్తిపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్‌బాబు(50) రైలు ఢీకొన్న ఘటనలో మృతి చెందినట్టు సామర్లకోట రైల్వే ఎస్సై పి.వాసు తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల మేరకు, ఆదివారం రాత్రి బిక్కవోలు–పెదబ్రహ్మదేవం గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ దాటుతున్న అతడిని గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో మృతి చెందాడన్నారు.
Comments
Please login to add a commentAdd a comment