కదిలిస్తే.. కన్నీటి వేదన
దివ్యాంగ పింఛను ఇప్పించండి
పుట్టుకతోనే నాకు వైకల్యం. టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తూ, ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నా. పింఛను మంజూరు చేయాలని ఎన్నోసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సదరం సర్టిఫికెట్ పొందినా పింఛను మాత్రం ఇవ్వడం లేదు.
– సర్రే దుర్గాప్రసాద్, ధవళేశ్వరం
రెండుసార్లు అర్జీ ఇచ్చినా..
కుటుంబ పెద్ద చనిపోయారు. పోషణ భారమైంది. వితంతు పింఛను మంజూరు చేయాలని రెండుసార్లు అర్జీ ఇచ్చినా ఫలితం లేదు. రేషన్ కార్డు, ఇంటి స్థలం కోసం ఇచ్చిన వినతులు కూడా బుట్టదాఖలయ్యాయి. ఇప్పటికైనా అధికారులు ఆదుకోవాలి.
– రుద్రపాటి ముత్యవేణి, ధవళేశ్వరం
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/సీటీఆర్‌ఐ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ – పీజీఆర్‌ఎస్) ప్రహసనంగా మారుతోంది. తమ గోడు వెళ్లబోసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న అర్జీదారులకు సకాలంలో, సరైన పరిష్కారం లభించడం లేదు. సమస్యలపై జిల్లా స్థాయి అధికారులకు వినతులిస్తూండగా.. వారు ఆయా శాఖల అధికారులకు అప్పగించి చేతులు దులుపుకొంటున్నారు. దీంతో తమ బాధలు చెప్పుకునేందుకు పలువురు అర్జీదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో ఎవరిని కదిలించినా కన్నీటి వేదనే వినిపించారు. తమ సమస్యలు తీర్చేవారే లేరంటూ నిట్టూర్చారు.
భూ సమస్యలపై అర్జీల వెల్లువ
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అత్యధిక శాతం అర్జీలు రెవెన్యూ సమస్యల పైనే వస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రతి వారం సుమారు 200 అర్జీలు వస్తూండగా.. వీటిలో 80 శాతం రెవెన్యూ సమస్యలే. మిగిలిన 20 శాతం రేషన్ కార్డులు, కొత్త పింఛన్ల మంజూరు, తొలగించిన పింఛన్ల పునరుద్ధరణ, పోలీస్, ఇతర శాఖల సమస్యలపై వస్తున్నాయి. గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే బాధితులకు వ్యయప్రయాసలు తప్పడం లేదు.
మరికొన్ని వినతులు
● ధవళేశ్వరానికి చెందిన పి.కోటకు గతంలో వితంతు పింఛను మంజూరు చేసి, ప్రస్తుతం చెప్పా పెట్టకుండా పింఛను ఆపేశారు. పిల్లల్ని పోషించడం కష్టంగా ఉందని, అధికారులు కరుణించి, పింఛన్ పునరుద్ధరించాలని వేడుకున్నారు.
● సీతానగరం మండలం రామచంద్రపురం వీఆర్‌ఓ టి.పుల్లారావు అనారోగ్య కారణాలతో 2021 నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఆయనకు రావాల్సిన జీతం మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు అర్జీ ఇచ్చారు.
సమస్యలపై కలెక్టరేట్‌కు
వస్తున్న బాధితులు
ప్రతి వారం వందలాదిగా అర్జీలు
పరిష్కారానికి తప్పని నిరీక్షణ
వ్యయప్రయాసలు పడినా
లాభం లేదంటూ నిట్టూర్పు
ప్రహసనంగా పీజీఆర్‌ఎస్
గత ఏడాది జూన్ 15 నుంచి వచ్చిన అర్జీల వివరాలు
అధికారులు స్వీకరించినవి 22,241
పరిష్కరించినవి 20,579
రీ ఓపెన్ చేసిన అర్జీలు 871
పరిష్కరించినవి 803
ఎక్కువగా వస్తున్న అర్జీలు రీసర్వే (80 శాతం)
ఇతర సమస్యలపై 20 శాతం
ఈ వివరాలు చూస్తూంటే చాలా వరకూ సమస్యలు పరిష్కారమైనట్లు కనిపిస్తోంది. అయితే, సమస్య ఆన్‌లైన్‌లో పరిష్కారమైనట్లు చూపిస్తున్నారే తప్ప.. తమకు సాంత్వన చేకూరడం లేదని బాధితులు వాపోతున్నారు.
చీకట్లో మగ్గుతున్నాం
మా ఊళ్లో జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకున్నాం. గృహ ప్రవేశం చేశాం. నేను దివ్యాంగురాలిని. నా 18 ఏళ్ల కుమారుడు ప్రశాంత్ సైతం దివ్యాంగుడు. విద్యుత్ కనెక్షన్ కోసం గ్రామ సచివాలయంలో రూ.1,800 చెల్లించి, దరఖాస్తు చేసుకుందామని వెళ్లాం. అప్లికేషన్ తీసుకోవద్దని లైన్‌మన్ చెప్పాడని కార్యాలయంలో చెబుతున్నారు. నా కుమారుడితో పాటు చీకట్లో మగ్గుతున్నా. డబ్బులు చెల్లిస్తామన్నా విద్యుత్ కనెక్షన్ ఎందుకివ్వడం లేదో అర్థం కావడం లేదు. న్యాయం చేయాలంటూ కలెక్టర్‌లో వినతిపత్రం సమర్పించా.
– పలివెల భవాని, దివ్యాంగురాలు, నందరాడ, రాజానగరం మండలం
మరుగుదొడ్డి కూల్చేశారు
మా ఊళ్లో నాకు సొంతిల్లు ఉంది. రోడ్డు వేయాలంటూ సర్పంచ్, పంచాయతీ అధికారులు, కొంతమంది వచ్చి మా స్థలంలోని మరుగుదొడ్డి, మెట్లను జేసీబీతో కూల్చేశారు. ఈలోగా 112కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేలోపు ఈ నెల 14వ తేదీ రాత్రి మరుగుదొడ్డిని జేసీబీతో పగులగొట్టి సామగ్రి పట్టుకుపోయారు. పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసుతో తమకు సంబంధం లేదని చెప్పారు. జరిగిన అన్యాయంపై ఎవరికి చెప్పుకోవాలో దిక్కు తోచని పరిస్థితుల్లో కలెక్టరేట్‌కు వచ్చాం. మరుగుదొడ్డిని కూల్చిన వారిపై చర్యలు తీసుకుని, తిరిగి నా స్థలంలో మరుగుదొడ్డి నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అర్జీ ఇచ్చా.
– పెద్దింటి అనంతలక్ష్మి, చంద్రవరం, చాగల్లు మండలం
కదిలిస్తే.. కన్నీటి వేదన
కదిలిస్తే.. కన్నీటి వేదన
కదిలిస్తే.. కన్నీటి వేదన
కదిలిస్తే.. కన్నీటి వేదన
కదిలిస్తే.. కన్నీటి వేదన
Comments
Please login to add a commentAdd a comment