ఆందోళన వద్దు : కలెక్టర్
గోపాలపురం: మండలంలో డయేరియా అదుపులోనే ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గోపాలపురం సీహెచ్‌సీలో చికిత్స పొందున్న డయేరియా బాధితులను సోమవారం ఆమె, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును రోగులను అడిగి తెసుకున్నారు. అనంతరం కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ. వివిధ గ్రామాల నుంచి వచ్చిన డయేరియా బాధితులకు సత్వర చికిత్స అందిస్తున్నామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో వైద్య బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. ఇప్పటి వరకూ 25 మంది చికిత్స పొందగా 20 మంది డిశ్చార్జి అయ్యారని, కొత్తగా 9 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. డయేరియా కేసులను గుర్తించేందుకు వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే చేస్తున్నారన్నారు. గోపాలపురం, తాళ్లపూడి మండలాల్లో అక్కడక్కడ డయేరియా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో వాటర్ ట్యాంకులు, స్టోరేజీ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టామన్నారు. ప్రజలకు అవసరమైన ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులు అందుబాటులో ఉంచామన్నారు. వాతావరణ మార్పులు, వడగాల్పులతో డయేరియా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చామని చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి పరిశీలనకు 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అనంతరం డయేరియా కేసులు నమోదైన గోపాలపురం, పెద్దగూడెం, చిట్యాల, పెద్దాపురం, వేళ్లచింతగూడెం గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి ఎన్‌వీ పద్మశ్రీ తదితరులు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment