శృంగార వల్లభునికి రూ.28.10 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.28,10,646 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ శాఖ కాకినాడ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్, గ్రామ సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 90 రోజులకు గాను హుండీల ద్వారా రూ.21,40,696, అన్నదానం హుండీ ద్వారా రూ.6,69,950 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు.
మహిళలను
మోసగించిన సర్కార్ ˘
శాసన మండలిలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
అల్లవరం: అధికారంలోకి వస్తే 50 ఏళ్ల వయస్సు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెలకు రూ.4 వేల పింఛన్ పథకాన్ని వర్తింపజేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ప్రభుత్వ తీరును శాసన మండలిలో మంగళవారం ఆయన ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలవుతున్నప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పింఛన్లు ఏవని ప్రశ్నించారు. ఈ పథకం కింద బడ్జెట్‌లో కేటాయింపులు చేయకుండా మహిళలను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 65,49,864 మందికి పింఛన్లు పంపిణీ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 63,53,907కు తగ్గిందని తెలిపారు. రెండు లక్షల పెన్షన్లు కోత పెట్టారని విమర్శించారు. ప్రతి నెలా పెన్షన్లు తీసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల పంపిణీకి రూ.32,634 కోట్లు అవసరం కాగా, బడ్జెట్‌లో రూ.27,512 కోట్లు మాత్రమే కేటాయించారని, దీనినిబట్టి భవిష్యత్‌లో చాలా పెన్షన్లను తొలగించే అవకాశం ఉందని చెప్పకనే చెబుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఐదేళ్ల పాటు అందించి వేలాది కుటుంబాలకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలను అన్ని విధాలా ఆదుకుంటే, కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోందని ఇజ్రాయిల్ అన్నారు.
రూ.9 వేల కనీస
పెన్షన్ ఇవ్వాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): దేశవ్యాప్తంగా 75 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లకు డీఏతో కలిపి కనీస పెన్షన్ రూ.9 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో కాకినాడ ఈపీఎఫ్‌ఓ కార్యాలయాన్ని పెన్షనర్లు మంగళవారం ముట్టడించారు. ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ ఆర్గనైజేషన్ల పిలుపు మేరకు ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు మాట్లాడుతూ, 13 సంవత్సరాలుగా ఈపీఎఫ్ పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. 36 లక్షల మంది కనీసం రూ.వెయ్యి పెన్షన్ కూడా పొందలేని పరిస్థితులు దేశంలో ఉన్నాయన్నారు. ఈపీఎఫ్ వద్ద రూ.8.88 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని, దీనిపై ఏటా రూ.52 వేల కోట్ల వడ్డీ వస్తోందని చెప్పారు. అయినప్పటికీ పెన్షన్ల రూపంలో కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మిగిలిన రూ.38 వేల కోట్లు తిరిగి కార్పస్ ఫండ్‌కు జమవుతోందని తెలిపారు. ఒకవైపు కార్పొరేట్లకు కేంద్రం రాయితీలు ప్రకటిస్తూ, రూ.వేల కోట్ల బ్యాంకు రుణాలు రద్దు చేస్తోందని, మరోవైపు ఈపీఎఫ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ మంజూరు చేయాలంటే సాకులు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబూరావు, సీనియర్ నాయకుడు రాందాస్ మాట్లాడుతూ, ఈపీఎఫ్ పెన్షనర్లకు సామాజిక పింఛన్లు ఇవ్వాలని, ఉచిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రైలు ప్రయాణాల్లో సీనియర్ సిటిజన్లకు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు.
శృంగార వల్లభునికి రూ.28.10 లక్షల ఆదాయం
Comments
Please login to add a commentAdd a comment