
సత్రం గదిలో ఖాళీ మద్యం సీసాలపై విచారణ
అన్నవరం: స్థానిక శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం కొండ దిగువన గల సత్యనికేతన్ సత్రంలోని ఒక గదిలో ఖాళీ మద్యం బాటిల్స్ దొరికిన వైనంపై విచారణ జరుగుతోందని, నివేదిక అందాక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన అన్నవరంలో పంపా నదిని పరిశీలించేందుకు వచ్చిన సందర్బంగా విలేకరులతో మాట్లాడారు. కొండ దిగువన సత్రంలో ఘటన జరిగితే రత్నగిరిపై సత్రాలలో జరిగినట్టుగా కొన్ని చానల్స్‌లో వార్తలు రావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు పూర్తి వివరాలు తెలుసుకుని వార్తలు ఇవ్వాలని కోరారు. దేవస్థానంలో టాయిలెట్స్ నిర్వహణపై కలెక్టర్ ఆరా తీశారు. స్వామివారి నిత్యకల్యాణ మండపం వద్ద గల టాయిలెట్స్‌ను ఆయన తనిఖీ చేశారు. మరింత శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నవరం మెయిన్ రోడ్డులో ఆక్రమణలు తొలగించాలని గ్రామస్తుడు ఈర్లు శ్రీనివాసరావు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించగా దీనిపై తగు చర్యలు తీసుకోవాలని పెద్దాపురం డీఎస్‌పీ శ్రీహరి రాజు, గ్రామ పంచాయితీ కార్యదర్శి చక్రవర్తిని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టర్ షణ్మోహన్
Comments
Please login to add a commentAdd a comment