
8 నుంచి సైనిక విన్యాసాలు
కాకినాడ సిటీ: కాకినాడ తీరంలోని నేవల్ ఎన్‌క్లేవ్‌లో వచ్చే ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకు భారత్, అమెరికా వాయుసేన దళాలు ఉమ్మడిగా నిర్వహించనున్న టైగర్ ట్రియంఫ్–25 సైనిక విన్యాసాలకు అవసరమైన సివిల్ సహకారాన్ని అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు. మంగళవారం ఆయన చాంబర్‌లో సైనిక విన్యాసాల నిర్వహణపై సైనిక, సివిల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సివిల్–మిలటరీ లైజాన్ అధికారి కమాండర్ వైకే కిషోర్ మాట్లాడుతూ భారత్ అమెరికా వాయుసేనల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 1 నుంచి 13వ తేదీ వరకూ టైగర్ ట్రియంఫ్–25 పేరిట ఉమ్మడి సైనిక విన్యాసాలను విశాఖపట్నం, కాకినాడ తీరాలలో నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 8 నుంచి 13వ తేదీ వరకూ కాకినాడ తీరంలోని నేవల్ ఎన్‌క్లేవ్‌లో యాంఫీబిఎస్ విన్యాసాలు సముద్రంలోను, ఉపరితలంపైన జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖలు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఈ మేరకు సైనికాధికారులు కోరిన అంశాలపై శాఖల వారిగా చేపట్టాల్సిన చర్యలు డీఆర్వో వెంకటరావు ఆయా శాఖల అధికారులకు సూచించారు. విశాఖపట్నం, కాకినాడల మధ్య సంచరించే రూట్లలో రోడ్ కాన్వాయ్ ఆపరేషన్స్‌కు అవసరమైన సహకారాన్ని సైనిక అధికారులకు అందించాలని సూచించారు. సముద్రంలో విన్యాసాలు జరిగే ప్రాంతానికి సమీపంలోకి మత్స్యకారుల బోట్లు ప్రవేశించకుండా మత్స్యశాఖ, మైరెన్ పోలీస్ శాఖలు కట్టుదిట్టం చేయాలన్నారు. ప్రథమ చికిత్స అందించేందుకు కాకినాడలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి అడ్వాన్సు లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ కలిగిన అంబులెన్స్‌లను వారం రోజులు అందుబాటులో ఉంచాలని డీఎంహెచ్‌వోను కోరారు. సైనిక అధికారి టీవీవీ ప్రసాద్, మైరెన్ పోలీస్ అధికారి రామ్మోహన్‌రెడ్డి, రూరల్ సీఐ చైతన్యకృష్ణ, ఎంహెచ్‌ఓ డాక్టర్ పృథ్వీ, మత్స్యశాఖ అధికారి అనూరాధ, కేఎస్పీఎల్, ఫైర్ మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ ఇంటిలిజెన్స్, సమాచారశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment