చెత్త పనులను ప్రశ్నించే వారేరీ..?
పర్యావరణానికి ‘మంట’
జనసేన ఆవిర్భావ సభ అనంతరం పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా, జనసేన నేతలు ఎక్కడికక్కడ పోగేసి, మంట పెట్టేశారు. దీంతో పచ్చని చెట్లతో ఆహ్లాదంగా ఉండే చిత్రాడ, పరిసర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులకు కమిటీ వేసినట్టు చెప్పుకొన్న జనసేన నేతలు.. నిజానికి వారు పెత్తనం చేసి, ఇతరులతో పని చేయించడమే కాకుండా, పర్యావరణానికి మంట పెట్టారని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించేస్తామని ఒంటికాలిపై నిలబడే నేతలున్న పార్టీ అది. అవసరమైతే నింగీనేలా ఏకం చేసేస్తామంటే.. జనాలు కూడా నిజమేననుకున్నారు. ఆ పార్టీ ఆవిర్భావ సభ ముగిస్తే కానీ వాస్తవం బోధపడలేదు ప్రజలకు. పార్టీ కార్యక్రమాలకు ప్రజాధనం దుర్వినియోగం, స్థానికసంస్థల సిబ్బందితో పారిశుధ్య పనులు.. తుదకు
భావి పౌరులైన విద్యార్థులతో కూడా ‘చెత్త’ పనులు చేయించి.. వారి నిజ స్వరూపమేమిటో కళ్లకు కట్టినట్టు చూపించారు.
పిఠాపురం: పాఠశాలల్లో పేరుకుపోయిన చెత్తను అపాయకర పరిస్థితుల్లో విద్యార్థులతో తొలగించిన అధికారుల తీరును మరువక మునుపే.. పిఠాపురంలో మరిన్ని వింత పోకడలు వెలుగుచూశాయి. ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభా ప్రాంగణంలో భారీగా చెత్త పేరుకుపోయింది. దీనిని తొలగించడానికి పార్టీ నేతలు శ్రమిస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిస్తున్నారు. వాస్తవానికి పిఠాపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికులను, ఉపాధి కూలీలను, మున్సిపల్ వాహనాలను వినియోగించి చెత్తను తొలగించారు. ఓ పార్టీ కార్యక్రమానికి పోగైన చెత్తను తొలగించడానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. పార్టీ కార్యక్రమానికి పారిశుధ్య కార్మికులతో పని చేయించడం స్వర్ణాంధ్ర.. పాఠశాల విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం స్వచ్ఛాంధ్ర అన్నట్టుగా ఉంది పిఠాపురంలో అధికారుల తీరు. రాజకీయ పార్టీ కార్యక్రమానికి వచ్చిన చెత్తను మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో తీయించి, పాఠశాలలో చెత్తను విద్యార్థులతో తీయించిన ఘనత పవన్ అడ్డాగా చెబుతున్న పిఠాపురం నేతలకే దక్కింది.
ఇటీవల పిఠాపురం మండలం చిత్రాడలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా టన్నుల కొద్దీ చెత్త వెలువడింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యక్రమం అయినందున, వారి సొంత సొమ్ముతో సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించాల్సి ఉంది. కానీ అధికార దుర్వినియోగం కావాల్సినంత చేసిన జనసేన నేతలు.. మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో, ఉపాధి కూలీలతో అంతా శుభ్రం చేయించడం విమర్శలకు దారితీసింది. పట్టణంలో పేరుకుపోయిన చెత్తను వదిలి, మున్సిపల్ సిబ్బంది జనసేన సభా ప్రాంగణంలో పేరుకున్న చెత్తను తొలగించడంపై పట్టణవాసులు మండిపడుతున్నారు. ఇంతవరకు ఎలా ఉన్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అడ్డాగా చెబుతున్న పిఠాపురంలో విద్యా ప్రదాతగా పేరొందిన పిఠాపురం మహారాజా కలల సౌధమైన ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించిన సంఘటనపై ఏ ఒక్క అధికారీ నోరు మెదపకపోవడాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఇదేనా అభివృద్ధి అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు. చదువుకునే పిల్లలతో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించినా.. ఏఒక్క అధికారి పట్టించుకోకపోవడమేనా పవన్ పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతం అని స్థానికులు నిలదీస్తున్నారు. ఏం చేసినా మమ్మల్ని అడిగేదెవరు అన్నట్టుగా ప్రజాప్రతినిధుల తీరు ఉంటే, వారి అండ చూసుకుని ప్రవర్తిస్తున్నారు అధికారులు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి, ఎన్నికల ప్రచారం చేసిన మున్సిపల్ కమిషనర్ కనకారావుపై చర్యలు లేవు. ఉన్నతాధికారి నిర్వహించే గ్రీవెన్స్‌లో జనసేన నేతలు హల్‌చల్ చేసినా చర్యలు శూన్యం. ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులతో పని చేయించిన ఉపాధ్యాయులపై చర్యలు అసలు లేవు.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ప్రతి నేత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నా.. అధికారులు తమ పరిధిని దాటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా.. ఎవరూ పట్టించుకునే వారు లేరు.
జనసేన బహిరంగ సభ తర్వాత కానీ బోధపడని వాస్తవం
పార్టీ చెత్త.. కార్మికులతో,
పాఠశాల చెత్త.. విద్యార్థులతో క్లీనింగ్
ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు
మున్సిపల్ కార్మికులు,
వాహనాల వినియోగం
ప్రజాధనం దుర్వినియోగంపై పట్టణవాసుల మండిపాటు
పార్టీ పనులకు ఉపాధి కూలీలు
చిత్రాడ జనసేన సభా ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్త తొలగించడానికి రోజుకు 80 మంది చొప్పున ఉపాధి కూలీలను వినియోగించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉపాధి కూలీలను ప్రైవేటు పనులకు ఉపయోగించరాదన్న కీలక నియమాన్ని తుంగలోకి తొక్కిన జనసేన నేతలు.. ఉపాధి కూలీలతో పారిశుధ్య పనులు చేయించారు. ఐదు రోజులుగా పని చేయించుకున్న జనసేన నేతలు కూలీలకు దగ్గరుండి మస్టర్లు వేయించడం, ఉపాధి సిబ్బందితో దగ్గరుండి పనులు చేయించడం వారి అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోందని స్థానికులు పెదవి విరుస్తున్నారు.
చెత్త పనులను ప్రశ్నించే వారేరీ..?
చెత్త పనులను ప్రశ్నించే వారేరీ..?
Comments
Please login to add a commentAdd a comment