
ఏప్రిల్ 30న పాలిసెట్
రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కోర్సులలో చేరేందుకు ఏప్రిల్ 30న పాలిసెట్ నిర్వహిస్తున్నట్లు బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్‌లైన్ కేంద్రం కో ఆర్డినేటర్ వి.నాగేశ్వరరావు తెలిపారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు, ప్రస్తుతం టెన్త్ పరీక్షలు రాస్తున్న వారు ఏప్రిల్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రవేశ పరీక్షకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, బీసీ, ఓసీ విద్యార్థులు రూ.400 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు http:// polycetap.nic.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ చదివిన వారికి ఉద్యోగావకాశాలు 100 శాతం లభిస్తాయయన్నారు. డిప్లొమా పూర్తి చేసిన అనంతరం బీటెక్ రెండో సంవత్సరంలో చేరవచ్చని నాగేశ్వరరావు తెలిపారు.
వడగాడ్పులపై విస్తృత ప్రచారం
రాజమహేంద్రవరం రూరల్: వడగాడ్పులపై విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బొమ్మూరులోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్‌వాడీ, ఆరోగ్య సహాయకులు, పంచాయతీ కార్యదర్శుల వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ తగలకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందించాలని, తాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఉదయం 11 గంటలకు బయటి పనులు ముగించుకుని, ఇళ్లకు చేరుకోవాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్ళినప్పుడు వాంతులు, ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వడదెబ్బగా గుర్తించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జె.సంధ్య, కంటి వెలుగు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై
పర్యవేక్షక సెల్
రాజమహేంద్రవరం రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారానికి రాజమహేంద్రవరంలోని తమ కార్యాలయంలో పర్యవేక్షక సెల్ ఏర్పాటు చేసినట్లు జిల్లా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) ఇంజినీరింగ్ అధికారి బి.వెంకటగిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రజలు తమ తాగునీటి సమస్యలను ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 91001 21190 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment