తీస్రా అష్రాతో అల్లాహ్ సాన్నిహిత్యం
ఫ ముగింపు దశలోకి పవిత్ర రంజాన్ మాసం
ఫ ముగిసిన మగ్‌ఫిరత్
ఫ ప్రారంభమైన తీస్రా అష్రా
ఫ నరకం నుంచి విముక్తి కోరడమే
చివరి పది రోజుల విశిష్టత
సాక్షి, రాజమహేంద్రవరం: ముస్లింల పవిత్ర రంజాన్ మాసం చివరి అంకానికి చేరుకుంది. రెండో పది రోజుల కాలం శ్రీమగ్‌ఫిరత్ కా అష్రాశ్రీ ముగిసింది. మూడో పది రోజుల కాలం ప్రారంభమైంది. మరో తొమ్మిది రోజుల్లో ఉపవాస దీక్షలు ముగియనున్నాయి. మనిషి చేసిన పాపాలకు మరణానంతరం విధించే నరకాగ్ని నుంచి విముక్తి కోరుకునేందుకు ఈ చివరి అష్రా (పది రోజులు) కేటాయించారు.
ఇదీ ఉద్దేశం
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12 నెలల్లో రంజాన్ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. రంజాన్ 30 లేదా 29 రోజులు కూడా వస్తుంది. ఈ మాసాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి పది రోజులు రహమత్‌కా అష్రా అంటారు. ఇందులో అల్లాహ్ కరుణ, దయ ఎక్కువగా ఉంటాయి. రెందో దశకాన్ని మగ్‌ఫిరత్ కా అష్రా అంటారు. మూడో దశకాన్ని జహన్నంసే పనాహ్ మాంగ్‌నేకా అష్రా అంటారు. ఇందులో అనేక విశిష్టతలున్నాయి. ఇది రంజాన్ మాసం ముగింపు సందర్భంగా కనిపించే చంద్ర దర్శనం వరకూ (21 రోజాల నుంచి 30 లేదా 29) ఉంటుంది. చేసిన పాపాలను కడిగేసుకునేందుకు తౌబా, అస్తగ్‌ఫర్‌ను పదేపదే పఠించాలి. నమాజులు చదివి, తెలిసీ తెలియక చేసిన తప్పులకు క్షమించమని అల్లాహ్‌ను దువా ద్వారా వేడుకోవాలి. జీవితంలో మరోసారి అలాంటి తప్పులు చేయబోమని స్వచ్ఛమైన మనసుతో వేడుకుంటే (తౌబా) కరడుగట్టిన పాపాత్ములకు కూడా అల్లాహ్ విముక్తి కల్పిస్తారని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధిస్తోంది. దీనిని అనుసరించి ముక్తి పొందాలని మౌల్వీలు, మత పెద్దలు ఉపదేశిస్తున్నారు.
లైలతుల్ ఖదర్ ప్రత్యేకం
రంజాన్ మాసం చివరి పది రోజుల్లో వచ్చే శ్రీలైలతుల్ ఖదర్ (పెద్ద రాత్రి) ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆ రాత్రి జాగరణ చేసి, అల్లాహ్‌ను ఆరాధించి, నమాజులు చేసి, ఖురాన్ పఠించి, దువా చేసి, అనుగ్రహం పొందితే మరణం తరువాత స్వర్గం లభిస్తుందని ఖురాన్ బోధిస్తోంది. వెయ్యి నెలల పాటు నిత్యం అల్లాహ్‌ను ఆరాధిస్తే లభించే పుణ్యం కేవలం పెద్ద రాత్రి ఆరాధనలతో లభిస్తుందని మౌల్వీలు చెబుతున్నారు. ఖురాన్ అవతరించింది ఈ అష్రాలోనే. ఇఖ్రా బిస్మి రబ్బిక్ అనే పారా భూమి పైకి వచ్చిందని మౌల్వీలు చెబుతారు. రంజాన్ మాసంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న పెద్ద రాత్రి ఏ రోజు రాత్రి ఉందో స్పష్టత లేదు. అయితే అది ఐదు తాఖ్‌రాత్‌లలో వెతుక్కోవాల్సి ఉంది. ఈ నెల 21, 23, 25, 27, 29 తేదీ ఉపవాస దీక్షలు పాటించడం కంటే ముందు వచ్చే రాత్రుల్లో ఏదైనా ఒక దానిలో ఉందని మహ్మద్ ప్రవక్త (సొల్లెల్లాహు అలైహి వసొల్లెం) బోధించిన హదీసు పుస్తకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఐదు రాత్రులూ జాగారం చేస్తే లైలతుల్ ఖదర్ విశిష్టతలను పొందవచ్చు. ఇందులో భాగంగానే ముస్లింలు జిల్లా వ్యాప్తంగా జాగరణ ద్వారా అల్లాహ్‌ను ఆరాధిస్తున్నారు. ఉదయం వరకూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు.
భక్తిశ్రద్ధలతో తాఖ్‌రాత్‌లు
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మసీదులున్నాయి. దాదాపు అన్నిచోట్లా తాఖ్‌రాత్‌లు నిర్వహిస్తున్నారు. మసీదులను రంగురంగుల విద్యుత్‌ద్దీపాలతో సుందరంగా అలంకరించారు. రాత్రంతా జాగారం చేసి, దైవారాధన చేపడుతున్నారు. జాగారం చేసిన వారికి మసీదుల్లో సెహరీకా ఇంతిజామ్ (భోజన ఏర్పాట్లు) చేపడుతున్నారు.
ఇతికాఫ్
ప్రపంచంతో పాటు సమాజ సుఖాలను త్యజించి, పూర్తిగా పది రోజుల పాటు అల్లాహ్ కోసం గడిపే కార్యక్రమాన్ని ఇతికాఫ్ అంటారు. మసీదులోనే ఒక మూలన ప్రత్యేక గదిలా డేరాల గుడారం ఏర్పాటు చేసుకుని, అక్కడే ఉండాలి. ప్రార్థనలూ చేసుకోవాలి. బయటకు రాకుండా అవసరమైన వాటిని అక్కడే ఉంచుకుని దైవ సాన్నిధ్యంలోనే గడపాలి. రంజాన్ చివరి రోజుల్లో నిర్వహించే అష్రాతో అల్లాహ్ సాన్నిధ్యం లభిస్తుంది.
పూర్వీకుల పాప విముక్తి
రంజాన్ రోజాల అనంతరం సాయంత్రం ఇఫ్తార్ వేళను మొర ఆలకించే సమయం అంటారు. ఆ సమయంలో కోరుకున్న వాటిని అల్లాహ్ ప్రసాదిస్తారని ఖురాన్ బోధిస్తోంది. ఇఫ్తార్‌కు ముందు చేసే దువాకు కూడా తప్పక ఆమోదం లభిస్తుంది. నరకం ఖరారైన పాపుల్లో (చనిపోయిన వ్యక్తులు) లక్షల మందికి ప్రతి ఇఫ్తార్ వేళలో అల్లా విముక్తి కల్పిస్తారని మత పెద్దలు చెబుతున్నారు. మొదటి రోజా నుంచి చివరి రోజా వరకూ ఎంత మందికి విముక్తి కల్పిస్తారో.. అంత మందికి రంజాన్ చివరి రోజు ఇఫ్తార్ సమయంలో ఒకేసారి విముక్తి కల్పిస్తారని అంటున్నారు. ఇఫ్తార్ వేళ చేసే దువాల్లో పూర్వీకులకు నరకం ఖరారై ఉంటే వారిని క్షమించి, విముక్తి కల్పించి, స్వర్గంలో ప్రవేశం కల్పించాలని కోరుకుంటే అది ఫలిస్తుందని మౌల్వీలు అంటున్నారు.
నమాజ్, దువాలోసమయం గడపాలి
రంజాన్ చివరి పది రోజుల్లో నమాజ్, దువాలోనే సమయం గడపాలి. ఇతికాఫ్ అనే ప్రత్యేక ఇబాదత్ చేయాలి. తద్వారా అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందవచ్చు. చేసిన పాపాల నుంచి విముక్తి పొందవచ్చు. ఇఫ్తార్ వేళల్లో పూర్వీకుల పాపాలను క్షమించాల్సిందిగా దువా చేయాలి.
– మొహమ్మద్ ఆరిఫ్,
జిల్లా వక్ఫ్‌బోర్డ్ మాజీ చైర్మన్
విద్యుద్దీప కాంతుల్లో
రాజమహేంద్రవరంలోని ఓ మసీదు
చివరి రాత్రి
రంజాన్ చివరి రోజు రాత్రిని శ్రీలైలతుల్ జాయిజాశ్రీ (తెల్లవారితే ఈదుల్ ఫితర్ పండగ) అంటారు. ఈ రాత్రి చేసిన దువాలు తప్పక ఫలిస్తాయని హదీసులు బోధిస్తున్నాయి. సాధారణంగా పండగ చేసుకోవాలనే సంబరంతో ముస్లింలు షాపింగ్‌లు, సరదాలతో ఉంటారు. కానీ ఆ రోజు చేసే దువాలకు దైవదూతలు (ఫిరిస్తే) కూడా ఆమీన్ (తథాస్తు) అంటాయని చెబుతున్నారు.
తీస్రా అష్రాతో అల్లాహ్ సాన్నిహిత్యం
Comments
Please login to add a commentAdd a comment