బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
రాజమహేంద్రవరం సిటీ: సమస్యల పరిష్కారానికి ఈ నెల 24, 25 తేదీల్లో జరపతలపెట్టిన బ్యాంకు ఉద్యోగుల సమ్మెను వాయిదా వేస్తున్నట్లు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సంఘం కార్యదర్శి లక్ష్మీపతిరావు, నాయకులు శేషుకుమార్, పాపారావు తెలిపారు. బ్యాంక్ యాజమాన్యాలు, సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో శుక్రవారం చర్చలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా త్వరలో తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో సమ్మె వాయిదా వేశామని తెలిపారు. అందువలన సోమ, మంగళవారాల్లో బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయని వారు తెలిపారు.
యువికా దరఖాస్తు గడువు రేపటితో పూర్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇస్రో ఉచిత సందర్శనకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారంతో గడువు ముగుస్తుందని జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ నెహ్రూ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇస్రో యువికా–2025కు (యువ విజ్ఞాన కార్యక్రమం) దేశంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికై న వారికి మే నెలలో రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించి, అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పిస్తారన్నారు. అలాగే దేశంలోని 7 ఇస్రో సెంటర్లను సందర్శించే అవకాశం కల్పిస్తారన్నారు. యువికాకు అర్హత సాధించిన విద్యార్థులకు ప్రయాణ, వసతి, భోజన సదుపాయాలను ఇస్రో ఉచితంగా అందిస్తుందని తెలిపారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ కోరారు.
రేపు అక్షరాస్యతా పరీక్ష
రాజమహేంద్రవరం రూరల్: శ్రీఉల్లాస్ – నవభారత సాక్షరతా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యుమరసీ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్‌వీవీఎస్ మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జిల్లాలోని రంగంపేట, రాజానగరం, బిక్కవోలు, చాగల్లు, నిడదవోలు, పెరవలి మండలాల్లోని 5,087 మంది నిరక్షరాస్యులైన గ్రామీణ మహిళలకు 509 మంది వలంటీర్లతో శిక్షణ తరగతులు నిర్వహించామని వివరించారు. వీరు చదవడం, రాయడం, లెక్కలు చేయడంలో సాధించిన పురోగతిని అంచనా వేసేందుకు ఈ అక్షరాస్యతా పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 10 నుంచి మూడు గంటల పాటు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన వారు వారి గ్రామాల్లోనే పరీక్ష రాయవచ్చని తెలిపారు. మొత్తం 5,087 మంది అభ్యాసకుల కోసం 143 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని అక్షరాస్యులుగా గుర్తిస్తూ జాతీయ సాక్షరతా విద్యా సంస్థ (ఎన్‌ఐఓఎస్) ధ్రువీకరణ పత్రం అందజేస్తుందని మూర్తి తెలిపారు.
పనిభారం తగ్గించండి
రాజమహేంద్రవరం రూరల్: పనిభారం పెరిగిపోయి, మానసిక ఒత్తిళ్లతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శాంతామణికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. మునుపెన్నడూ లేని విధంగా సర్వేలతో పాటు, పదుల సంఖ్యలో పనులు అప్పగించడంతో వాటి నిర్వహణ కష్టంగా ఉందన్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగులు మరణించిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పనిభారం తగ్గించాలని కోరారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ దృష్టికి కూడా తమ సంఘం నాయకులు ఈ విషయాన్ని తీసుకు వెళ్లారన్నారు. పంచాయతీల్లో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, లైసెన్స్ ఫీజులు, లీజులు, వేలం పా టలు, ఇతర పన్నుల వసూళ్ల వంటివి చేపట్టాల్సి ఉందన్నారు. అంతే కాకుండా పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, వీధిలైట్లు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు అనేక ధ్రువీకరణలు చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే, రికార్డుల నిర్వహణ, అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన 15 రకాల సర్వే యాప్‌ల ద్వారా పని చేయడం భారంగా మారుతోందని డీపీవో దృష్టికి తీసుకుని వెళ్లారు. డివిజన్ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు టంకాల శ్రీనివాస్, మేకా ప్రసాద్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి జి.వెంకట్రావు, సీనియర్ కార్యదర్శులు రూప్‌చంద్, వి.శ్రీనివాసరావు, శ్రీరామమూర్తి, కొవ్వూరు డివిజన్ నాయకులు షేక్ ఖాసిం సాహెబ్, మహ్మద్ జానీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment