భక్తులతో శోభిల్లిన వాడపల్లి
● వైభవంగా పూజాదికాలు
● ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు
కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర క్షేత్రం భక్తజనంతో శోభిల్లింది. ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. తిరుప్పావై ద్రవిడ వేదపారాయణం చేసి సుందరంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీదుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. గోవింద నామస్మరణతో వాడపల్లి మార్మోగింది. 11 గంటల నుంచి నుంచి వేలాది మందికి అన్న సమారాధన చేశారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రద్దీ మేరకు ఏర్పాట్లు..
వాడపల్లి క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని డీఎస్పీ సుంకర మురళీమోహన్ అన్నారు. శనివారం ఆయన క్షేత్రాన్ని సందర్శించి క్యూలైన్లను, పార్కింగ్ స్థలాలను పరిశీలించి భక్తులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. ఈఓ చక్రధరరావు, స్థానిక పోలీసు అధికారులతో ఈ మేరకు సమీక్షించి పలు సూచనలిచ్చారు. దేవస్థానం సెక్యూరిటీ పెంచాలని, బందోబస్తుకు అదనపు సిబ్బందిని పెంచే చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆయన వెంట రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై రాము ఉన్నారు.
ఒక్క రోజు ఆదాయం రూ 50.97 లక్షలు
దేవస్థానానికి శనివారం సాయంత్రం 4 గంటల వరకూ విశిష్ట దర్శనం ద్వారా రూ.13,05,400, ప్రత్యేక దర్శనం ద్వారా రూ.8,63,900, వేదాశీర్వచనం ద్వారా రూ.16,76,232, లడ్డు ప్రసాదం ద్వారా రూ 6,11,100, శాశ్వత అన్నదానానికి రూ.83,428, నిత్యాన్నదానానికి రూ.1,45,341, ఆన్‌లైన్ టిక్కెట్ల ద్వారా రూ.1,57,048 పాటు వివిధ రూపాల్లో రూ.50,96,624 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు.
బాలబాలాజీ ఆలయంలో కోలాహలం
మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లిలో కొలువు తీరిన బాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారు జామున సుప్రభాత సేవ, తొలి హారతి అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారి సన్నిధిలో శ్రీలక్ష్మీ నారాయణ హోమం నిర్వహించారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.2,58,570 ఆదాయం వచ్చిందని ఈఓ ఎం.సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి నిత్యాన్నదానం ట్రస్టుకు భక్తులు రూ.55,783 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. 2,300 మంది భక్తులు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.
భక్తులతో శోభిల్లిన వాడపల్లి
Comments
Please login to add a commentAdd a comment