గాంధీకాలనీలో అంబేడ్కర్‌కు అవమానం
● విగ్రహానికి చెప్పుల దండ వేసిన
దుండగులు
● ఆందోళన చేపట్టిన రిజర్వేషన్ల
వ్యతిరేక పోరాట సమితి
● బాధ్యులపై చర్యలు తీసుకోవాలని
మాజీ హోం మంత్రి వనిత డిమాండ్
నల్లజర్ల: మండలం దూబచర్ల శివారు గాంధీకాలనీలో రహదారి పక్కనున్న అంబేడ్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. శనివారం ఉదయం విగ్రహానికి చెప్పులదండ ఉండటం చూసి అంబేద్కర్ అభిమానులు, రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దూబచర్ల–లక్కవరం రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆందోళన 11 గంటల వరకు జరుగుతూనే ఉంది. పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని చెప్పుల దండను తొలగించి క్లూస్ టీం, డాగ్‌స్కాడ్‌లను రంగంలోకి దింపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని అరెస్ట్ చేయాలని కోరారు. అనంతరం మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి తానేటి వనిత సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. ఈ ఘటన హేయమైన చర్య అని, పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇక్కడి విగ్రహాన్ని తొలగించి నూతన విగ్రహం ఏర్పాటు చేసి పైన రూఫ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారు ఏర్పాటు చేయకపోతే తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండలశాఖ అధ్యక్షులు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, నాయకులు బంక అప్పారావు, ముప్పిడివెంకటరత్నం, సాలి వేణు, తొమ్మండ్రు రమేష్, నక్కా పండు, పంది సత్యనారాయణ, తొమ్మండ్రు రవి, పెండ్యాల హరేరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఏఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ దేవకుమార్, నల్లజర్ల, దేవరపల్లి, కొవ్వూరు సీఐల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment