ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి

Published Mon, Mar 24 2025 6:33 AM | Last Updated on Mon, Mar 24 2025 6:33 AM

ఆయిల్

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి

పెరవలి: జిల్లాలో వరి తరువాత అధిక మొత్తంలో సాగు అవుతున్న పంట ఆయిల్‌పామ్‌. 19,266 హెక్టార్లలో ఈ పంట సాగు జరుగుతుండగా సంవత్సరానికి 76 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తోంది. ఈ పంటలపై వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ఆశించి ఉండటంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతోందని, సత్వరం సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌ తెలిపారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు తీసుకోవాల్సిన చర్యల గురించి, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన వివరించారు.

కొమ్ము పురుగు

కొమ్ముపురుగు ఆయిల్‌పామ్‌ మొక్కలను ఆశించినప్పుడు మొక్కల ఆకులు వి ఆకారంలో కత్తిరించినట్టు ఉంటాయి. ఈ పురుగులు భూమిలో ఏర్పడిన పగుళ్లలో నివసిస్తాయి. అంతేకాకుండా చెట్టు మొదలులో ఉన్న పీచులో కూడా ఇవి చేరి పంటకు హాని చేస్తాయి. ఇవి మొవ్వలోకి కూడా ప్రవేశించి మెత్తని పదార్థాన్ని తినేస్తాయి.

నివారణ చర్యలు

మొక్కల చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వాటి మీద కార్బరిల్‌ మందును 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వలో పురుగులు ఉన్నట్టు గుర్తిస్తే వాటిని తీగతో తీసివేసి అది చేసిన రంధ్రానికి 25 గ్రాముల కార్బరిల్‌ మందును 10 గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి.

సంచి పురుగు

ఈ పురుగులు శంఖు ఆకారంలో ఉండి ఆకు అడుగు భాగాన చేరతాయి. ఆకులకు రంధ్రాలు చేసి తినివేస్తాయి.

నివారణ చర్యలు

ఈ పురుగులు సోకిన ఆకులను కత్తిరించి తగులబెట్టాలి. మిగిలిన ఆకుల మీదు కార్బరిల్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

మొవ్వుకుళ్లు తెగులు

తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దీని ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క పసుపురంగులోకి మారి మొవ్వ ఆకులను లాగితే తేలికగా వస్తాయి. మొవ్వ లాగిన మొక్క నుంచి తీవ్ర దుర్గంధం వస్తుంది.

నివారణ చర్యలు

ఈ తెగులు సోకిన భాగాన్ని శుభ్రం చేసి లీటరు నీటికి కార్బండిజమ్‌ గ్రాము మందు కలిపి ఆ ప్రాంతమంతా పూయాలి.

గానోడెర్మా కుళ్లు తెగులు

ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కింద వరుసలో ఎండిపోతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొవ్వులోకి చేరి

కాండం మొదలు వద్ద కణజాలాన్ని ఆశించడంతో అక్కడ కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది.

నివారణ చర్యలు

తెగులు సోకి చనిపోయిన చెట్లను వెంటనే చేను నుంచి తొలగించాలి. ఆ చెట్టు వేరును తీసి ట్రైడీమార్ఫ్‌ మందును 100 మిల్లీ లీటర్లు లీటరు నీటిలో కలిపి ఆ వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా చెట్టు మొదలులో వేయాలి.

కాండం తడి తెగులు

ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వు అకస్మాత్తుగా వడలి, ఎండిపోతుంది. మిగిలిన ఆకులు త్వరితగతిన వడలి ఎండిపోతాయి. మొవ్వు ఆకు వడలిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభిస్తే చెట్లు కోలుకుని బతుకుతాయి.

నివారణ చర్యలు

ఈ తెగులు సోకిన చెట్టు మొవ్వును లాగి అందులో కుళ్లిన పదార్థాన్ని తీసి శుభ్రం చేసిన తరువాత కార్బండిజమ్‌, మోనోక్రోటోఫాస్‌లను కుళ్లిన చోట పైపూతగా వేసి ఆ తరువాత తారును పూసి ఉంచాలి.

గెలకుళ్లు తెగులు

ఈ తెగులు సోకిన గెలలు కుళ్లిపోవడంతో తెల్లని శిలీంధ్రాలతో కనిపిస్తాయి. ఈ తెగులు సోకిన గెలలను వెంటనే నరికివేసి ఆ ప్రాంతంలో కుళ్లిన పదార్థాలను తీసి 0.1 శాతం కార్బండిజమ్‌ మందుతో శుద్ధి చేయాలి. ఇలా చేయడం వలన మిగిలిన గెలలకు ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది.

ఎరువుల యాజమాన్యం

ఆయిల్‌ పామ్‌ మొక్కలకు సంవత్సరానికి రెండు మోతాదుల్లో ఎరువులు అందించాలి. మొదటి మోతాదు జూన్‌, జూలై నెలల్లోను, రెండవ మోతాదు డిసెంబర్‌, జనవరి నెలల్లోనే వేయాలి. మూడేళ్ల వయస్సు దాటిన ఒక్కో మొక్కకు 2 కిలోల 600 గ్రాముల యూరియా, సింగిల్‌ఫాస్ఫేట్‌ 3 కిలోల 750 గ్రాములు, పొటాష్‌ 2 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్‌ 500 గ్రాములు ఏడాదిలో రెండుసార్లు వేయాలి.

జిల్లాలో వరి తరువాత

అధికంగా సాగవుతున్న పంట

సస్య రక్షణతో సమస్య దూరం

No comments yet. Be the first to comment!
Add a comment
ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి 1
1/4

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి 2
2/4

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి 3
3/4

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి 4
4/4

ఆయిల్‌ పామ్‌పై తెగుళ్ల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement