
విజేత కోనసీమ వృషభం
సామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. కేవలం సెకండ్ల వ్యత్యాసంలో ఎడ్లు విజేతలుగా నిలిచి యజమానికి గర్వకారణంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పోటీలను తిలకించి మాట్లాడుతూ గతంలో ఎంత పశు సంపద ఉంటే అంత గొప్పవారిగా పరిగణించే వారని పేర్కొన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఏరువాక సాగడానికి కొందరు రైతులు ఎడ్లను పెంచుతూ ఇటువంటి పోటీలకు రావడం హర్షణీయమన్నారు. ఎడ్ల పరుగు పోటీల్లో పాల్గొనే రైతులే నిర్వాహకులుగా శ్రీకుమారా రామ భీమేశ్వర రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలను వల్లూరి సత్యేంద్రకుమార్ మెమోరియల్‌గా ఏర్పాటు చేయడం ఆయనపై ఉన్న గౌరవ చాటిచెప్తొందని అన్నారు. ఈ పోటీలను మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం ప్రారంభించారు.
సీనియర్ విభాగంలో
ఉమ్మడి జిల్లాలైన తూర్పు, పశ్చిమ, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాలకు చెందిన 12 జతల ఎడ్లు, జూనియర్ విభాగంలో 31 జతల ఎడ్లు పాల్గొన్నాయి. హోరాహోరీగా సాగిన పరుగు పందెంలో కోనసీమ జిల్లా గుమ్మిలేరుకు చెందిన కోరా శృతిచౌదరి ఎడ్లు మొదటి స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో అనకాపల్లికి జిల్లా అర్జునగిరికి చెందిన పరవన్నాయుడు ఎడ్లు, మూడో స్థానంలో మళ్లీ శృతిచౌదరి ఎడ్లు నిలిచాయి. వారికి వరుసగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, నిర్వాహకుడు కంటే ఫణికుమార్, వుండవిల్లి వీరవెంకటరామరాజు బహుమతులను అందజేశారు. మొదటిస్థానంలో నిలచిన ఎడ్లు నిర్ణీత దూరాన్ని ఐదు నిమిషాల 24 సెకండ్ల 93 మిల్లీ సెకండ్లలో, రెండో స్థానంలో నిలచిన ఎడ్లు ఐదు నిమిషాల 31 సెకండ్ల 16 మిల్లీ సెకెండ్లలో, మూడో స్థానంలో నిలచిన ఎడ్లు ఐదు నిమిషాల 34 సెకండ్ల 81 మిల్లీ సెకెండ్లలో విజేతలుగా నిలిచాయి.
జూనియర్ విభాగంలో
ప్రధమ విజేతగా సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్రకుమార్ ఎడ్లు, ద్వితీయ విజేత వడిశిలేకుకు చెందిన ధరణి శ్రీనివాసు ఎడ్లు, తృతీయ విజేత గాడాలకు చెందిన మద్దాల శ్రీను ఎడ్లు, నాలుగో బహుమతిగా వెల్దుర్తికి చెందిన మొగిలి ఏసుబాబు ఎడ్లు, ఐదవ బహుమతిగా మళ్లీ సత్యేంద్రకుమార్ ఎడ్లు బహుమతులు గెలుచుకున్నాయి. వీరికి రైతు సంఘం అధ్యక్షుడు కంటే బాబు బహుమతులు అందజేశారు.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సిద్దా నానాజీ, యనమల కృష్ణ, చేకూరి రామకృష్ణ వ్యవహరించగా, నిర్వాహకులు వల్లూరి దొరబాబు, బిక్కిన రంగ నాయకులు, వుండవిల్లి వీరవెంకటరామరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోలి వెంకట అప్పారావుచౌదరి, యార్లగడ్డ చిన్ని, కౌన్సిలర్ బలుసు వాసు, రైతు సంఘ నాయకుడు కంటే బాబు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కొండపల్లి శ్రీనివాసు, నిమ్మకాయల రంగనాగ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాగిన ప్రదర్శనను దారి పొడవునా ప్రజలు చెట్లు ఎక్కి మరీ ఆసక్తిగా తిలకించారు.
ఉత్కంఠగా రాష్ట్ర స్థాయి
ఎడ్ల పరుగు పోటీలు
జూనియర్ విభాగంలో
విజేత సామర్లకోట
Comments
Please login to add a commentAdd a comment