
నిర్మలగిరి.. భక్తజన ఝరి
ఫ కిటకిటలాడిన మేరీ మాత పుణ్యక్షేత్రం
ఫ ప్రత్యేక వాహనాలపై తరలి వచ్చిన భక్తులు
దేవరపల్లి: గౌరీపట్నంలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీ మాత మహోత్సవాలు రెండు రోజులుగా వైభంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఆదివారం భక్తజన ప్రవాహం పోటెత్తింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు బస్సులు, ఆటోలు, కార్లు, ఇతర వాహనాల్లో తరలి వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, తమ కోర్కెలను మరియతల్లికి విన్నవించుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కుటుంబ సమేతంగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. పలువురు భక్తులు సుమారు 200 మీటర్ల ఎత్తయిన కొండ పైన ఉన్న క్రీస్తు ఆలయానికి మెట్ల దారిలో మోకాళ్లపై ఎక్కి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మెట్ల దారిపై ఈ ఏడాది రేకుల పందిరి వేశారు. పుణ్యక్షేత్రం ప్రధాన ద్వారం వద్ద ఉన్న మరియతల్లి మండపం వద్ద భక్తులు ఆ తల్లి స్వరూపం వద్ద మోకరిల్లి ప్రత్యేక ప్రార్థనల ద్వారా తమ కోర్కెలు విన్నవించుకుంటున్నారు. మతాలకు అతీతంగా ప్రజలు మేరీ మాత ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు సమర్పించడం పుణ్యక్షేత్రంలో ప్రత్యేకత. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక షెడ్లలో భక్తులు విశ్రాంతి తీసుకుంటున్నారు.
పెరిగిన రద్దీ
సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉత్సవాలకు నాలుగు రోజుల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. పుణ్యక్షేత్రం ఏర్పడి దాదాపు 40 ఏళ్లు కాగా, అఖండ దేవాలయ ప్రతిష్ఠాపన జరిగి 25 ఏళ్లవడంతో, ఈ ఏడాది సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకూ తరలివస్తున్న భక్తులతో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. వారికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యాన దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు
మేరీమాత ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. గుండుగొలను – కొవ్వూరు పాత జాతీయ రహదారికి ఇరువైపులా పుణ్యక్షేత్రం ఉండడంతో ఈ నెల 25వ తేదీ వరకూ ట్రాఫిక్‌ను హైవే మీదుగా మళ్లించారు. కొవ్వూరు వైపు వెళ్లే భారీ వాహనాలు, క్వారీ లారీలను దేవరపల్లి, దుద్దుకూరు వద్ద.. దేవరపల్లి, జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే వాహనాలను గౌరీపట్నం, పంగిడి వద్ద జాతీయ రహదారి వైపు మళ్లించినట్లు ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు యథాతథంగా తిరుగుతాయని చెప్పారు.
మార్మోగుతున్న క్రీస్తు ఆరాధన
క్రీస్తు ఆరాధనతో పుణ్యక్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 25న పీఠాధిపతులు దివ్యబలి పూజ సమర్పణతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. నవదిన జపాలు, దివ్యబలి పూజలు, పవిత్రాత్మ స్వస్థత ప్రార్థనలు, పరిశుద్ధ జపమాల వంటి దైవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు పీఠాధిపతి, విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఎస్.జాన్‌పీటర్ ఆధ్వర్యాన ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పుణ్యక్షేత్రంలో ఆదివారం నల్గొండ పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ కరణం ధమన్ కుమార్, వికార జనరల్ పి.బాల, రెవరెండ్ ఫాదర్ డి.ఆరోన్, జి.మోజెస్ దివ్యబలి పూజ, పవిత్రాత్మ స్వస్థత ప్రార్థనలు, పరిశుద్ధ జపమాల, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పీఠాధిపతులు, ఫాదర్లు ప్రార్థనలు చేసి భక్తులను ఆశీర్వదించారు.

నిర్మలగిరి.. భక్తజన ఝరి

నిర్మలగిరి.. భక్తజన ఝరి

నిర్మలగిరి.. భక్తజన ఝరి

నిర్మలగిరి.. భక్తజన ఝరి
Comments
Please login to add a commentAdd a comment