అసలేం జరుగుతోంది..!
● సాధారణ స్థాయిలోనే
బలభద్రపురం క్యాన్సర్ కేసులు
● అధికారులు, వైద్య బృందం స్పష్టీకరణ
● ఆందోళన అవసరం లేదన్న
వైద్య, ఆరోగ్య మంత్రి
● 38 మంది అనుమానితులకు
వైద్య పరీక్షలు
● 10 మందికి క్యాన్సర్ లేదని నిర్ధారణ
● మిగిలిన వారి రిపోర్టుల కోసం
ఎదురు చూపులు
● రక్త పరీక్షలు చేస్తే తెలుస్తుందన్న ఎమ్మెల్యే
సాక్షి, రాజమహేంద్రవరం: బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఏం జరుగుతోంది.. నిజంగానే క్యాన్సర్ కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయా.. పరిస్థితి అంత ఆందోళనకరంగా ఉందా.. అని ప్రశ్నిస్తే అంత తీవ్రత ఏమీ లేదని అధికార యంత్రాంగం, వైద్య బృందాలు కొట్టిపారేస్తున్నాయి. జాతీయ సగటు గణాంకాలతో పోలిస్తే.. ఇక్కడ నమోదైన కేసులు సాధారణమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా బలభద్రపురంలో క్యాన్సర్ ఆందోళనకర స్థాయిలో లేదని సోమవారం అమరావతిలో ప్రకటించారు. కానీ, స్థానిక అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం.. వ్యాధి బాధితుల గుర్తింపునకు చేపట్టిన సర్వే పారదర్శకంగా జరగడం లేదని, ఏదో ఒక డేటా తీసుకుని సర్వే చేస్తే ఎలాగని, గ్రామంలో 200కు పైగా కేసులున్నాయని వాదిస్తున్నారు. ఈ అంశాన్ని ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడంతో గ్రామంలో మొదలైన ఆందోళన నేటికీ కొనసాగుతోంది. అయితే, అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేనే తమను నమ్మకపోతే ఎలాగని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇన్నేళ్లుగా స్పందించని ఎమ్మెల్యే.. ఇప్పుడు ఎందుకు అంతగా స్పందించాల్సి వస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద గ్రామంలో మూడు రోజులుగా ఆందోళన కలిగించేలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటూండటంతో బలభద్రపురం వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఏం జరిగిందంటే..
బలభద్రపురంలో క్యాన్సర్ విస్తరణకు కారణాల్ని అధ్యయనం చేయాలంటూ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాల్ని పరిశీలించాలంటూ పర్యావరణ శాఖకు ఎన్నిసార్లు చెప్పినా లెక్క చేయడం లేదని పేర్కొన్నారు. ఆ గ్రామంలో 200 మందికి పైగా క్యాన్సర్ బాధితులున్నారని ఆరోపించారు. అప్పటి నుంచీ ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది.
రంగంలోకి దిగిన యంత్రాంగం
ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు అధికారులు, వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. బలభద్రపురం గ్రామాన్ని మూడు రోజుల పాటు జల్లెడ పట్టారు. ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు. గ్రామంలో 3,500 ఇళ్లున్నాయి. జనాభా 10,800. వైద్య బృందాలు ఈ నెల 22, 23 తేదీల్లో 8,830 మందిపై సర్వే చేశారు. ఏకంగా 31 బృందాలు సర్వేలో భాగస్వాములయ్యాయి. వివిధ మార్గాల ద్వారా డేటా తీసుకుని మరీ పరిశీలించారు. చివరకు సర్వేలో 38 మంది అనుమానితులను మాత్రమే గుర్తించారు. వైద్య పరీక్షల అనంతరం వీరిలో 10 మందికి క్యాన్సర్ లేదని నిర్ధారించారు. మిగిలిన వారికి సంబంధించిన వైద్య పరీక్షల నివేదికలు ఇంకా రావాల్సి ఉంది.
అధికారులపై నిందలు
అయితే, అధికారులు చెప్పిన లెక్కలు ఎమ్మెల్యే నల్లమిల్లికి మింగుడుపడలేదు. తాను చేసిన ఆరోపణకు ఎలాగైనా బలం చేకూర్చాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. సర్వే సక్రమంగా జరగడం లేదని, ఆరోగ్యశ్రీ డేటా తీసుకుని సర్వే చేస్తే ఎలా తెలుస్తుందని అధికారులపై నిందలు వేయడం ప్రారంభించారు. సర్వే పారదర్శకంగా జరగడం లేదన్నారు. పదుల సంఖ్యలో క్యాన్సర్ రోగులను తమ కార్యకర్తలే ఆస్పత్రులకు తీసుకెళ్లారని, అలాంటిది కేసులు లేవంటే ఎలాగని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా అధికారులు మాత్రం తాము చేపట్టిన సర్వేలో భారీ స్థాయిలో కేసులు వెలుగు చూడలేదని బహిర్గతం చేశారు.
ఎమ్మెల్యే యూటర్న్?
బలభద్రపురం గ్రామంలో తాను ఆరోపించిన స్థాయిలో క్యాన్సర్ కేసులు లేవని అధికారులు, వైద్య బృందాలు నిర్ధారించడంతో ఎమ్మెల్యే నల్లమిల్లి యూటర్న్ తీసుకున్నారు. తాను అసెంబ్లీలో లేవనెత్తిన సమస్యకు ప్రభుత్వం, కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేస్తున్నారని సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తమకు క్యాన్సర్ ఉందని చెప్పడానికి కొంతమంది గ్రామస్తులు ఇష్టపడటం లేదన్నారు. ప్రతి ఇంటి నుంచీ రక్త నమూనాలు సేకరించాలని, తద్వారా సర్వే కొనసాగించాలని కోరారు. గ్రామంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని గ్రామస్తులు చెప్పడంతో తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని సమర్థించుకున్నారు. వైద్య పరీక్షలు చేసి, క్యాన్సర్ లేదని నిర్ధారిస్తే తనకూ సంతోషమేనంటూ మిన్నకుండిపోయారు.
డైవర్షన్ పాలిటిక్స్
ఈ మొత్తం ఎపిసోడ్‌పై అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర తీశారని విమర్శించారు. కొన్నేళ్లుగా గుర్తుకు రాని బలభద్రపురం ప్రజల సమస్యలు ఒక్కసారిగా ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదని అన్నారు. దీని వెనుక రాజకీయ ఎత్తుగడ దాగి ఉందని దుయ్యబట్టారు. కాపవరం వద్ద చెత్తతో విద్యుత్ తయారీ కేంద్రం పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం నాంది పలికిందని, మంత్రి నారాయణ సైతం ఇటీవల ఆ స్థలాన్ని పరిశీలించారని గుర్తు చేశారు. ఈ పరిశ్రమకు పెద్ద మొత్తంలో చెత్తను తరలించాల్సి ఉంటుందని, అదే జరిగితే గ్రామం కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారే సూచనలున్నాయని, అందువలన స్థానిక ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇది గ్రహించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే.. తనకు తెలియకుండానే మంత్రి వచ్చి వెళ్లారంటూ సాకులు చెబుతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా, సమాచారం ఇవ్వకుండా ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నించారు. కేవలం ప్రజా వ్యతిరేకతను దారి మళ్లించేందుకే ప్రజల్లో ఇలాంటి భయాందోళనలు రేకెత్తించి, రాజకీయ లబ్ధి పొందాలని చూడటం దారుణమని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలేం జరుగుతోంది..!
Comments
Please login to add a commentAdd a comment