నిర్మలగిరి.. వెలుగుల సిరి
● విద్యుద్దీప కాంతుల్లో
మెరిసిపోతున్న పుణ్యక్షేత్రం
● వైభవంగా మేరీమాత ఉత్సవాలు
దేవరపల్లి: గౌరీపట్నంలోని నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం విద్యుద్దీప కాంతులతో మెరిసిపోతుంది. సుమారు 120 ఎకరాల్లో ఎత్తయిన కొండపై విస్తరించిన ఈ పుణ్యక్షేత్రం మేరీమాత ఉత్సవాల సందర్భంగా ధగద్ధగాయమానంగా వెలుగులీనుతూ, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చీకటి పడితే చాలు.. రంగురంగుల విద్యుద్దీపాలతో ఈ పుణ్యక్షేత్రం ప్రజలకు కనువిందు చేస్తుంది. ఇక్కడి కలవరి కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ఉన్న ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద ఉన్న మరియ తల్లి స్వరూపం, అక్కడే ఉన్న ఫాతిమా టవర్ విద్యుద్దీప తోరణాలతో కొత శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత మహోత్సవాలకు ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు ఇతర జిల్లాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు, ఫాదర్లు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. క్రైస్తవులతో పాటు ఇతర మతస్తులు కూడా ఇక్కడకు తరలి రావడం విశేషం. రాత్రి సమయంలో బస్సులు, లారీలు, కార్లు, ట్రాక్టర్లు, ఆటోలపై ఇక్కడకు చేరుకుని, మిరుమిట్లు గొలుపుతున్న విద్యుద్దీప కాంతులను కన్నులారా తిలకించి, ఆనందపరవశులవుతున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమే అవుతోంది. ఉత్సవాల చివరి రోజయిన మంగళవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, జార్జి ఆంథోనీ స్వామి, సకిలి ప్రకాష్, కరణం ధమన్ కుమార్, గోరంట్ల జ్వానేస్, పిల్లి ఆంథోనీదాస్‌లు పుణ్యక్షేత్రంలో సమష్టి దివ్యబలి పూజ సమర్పిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్‌పీటర్ తెలిపారు. ఉత్సవాలు జరుగుతున్న నాలుగు రోజుల్లో సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సుమారు 6 లక్షల మంది ప్రార్థనలు చేశారని చెబుతున్నారు.
విద్యుద్దీప కాంతుల్లో నిర్మలగిరి పుణ్యక్షేత్రం
ఆకట్టుకుంటున్న అఖండ దేవాలయం
నిర్మలగిరి.. వెలుగుల సిరి
నిర్మలగిరి.. వెలుగుల సిరి
నిర్మలగిరి.. వెలుగుల సిరి
Comments
Please login to add a commentAdd a comment