వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి
రాజమహేంద్రవరం సిటీ: అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నుంచి కార్మికులకు రక్షణ కల్పించేందుకు జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు తక్షణ చర్యలు చేపట్టాలని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్‌ఎం వలి సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు పరిశ్రమలు, పని ప్రదేశాల్లో కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యలపై సూచనలు జారీ చేశారు. కష్టతరమైన పనులు చేసే కార్మికులు, పని వారికి పని వేళలను రీషెడ్యూల్ చేయాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ కార్మికులతో పనులు చేయించరాదు. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే సమయానికి కార్మికుల పని గంటలు మార్చాలి. పని ప్రదేశాల్లో కార్మికులందరికీ తగినంత పరిమాణంలో చల్లని, సురక్షితమైన తాగునీరు, అత్యవసర ఐస్ ప్యాక్‌లు, వేడి, అనారోగ్య నివారణ సామగ్రిని అందుబాటులో ఉంచాలి. పని ప్రదేశాల్లో షెల్టర్లు, శీతలీకరణ ప్రాంతాలు, అత్యవసర ఔషధాలు, ద్రవాల వంటివి అందించాలి. వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల వల్ల వచ్చే ముప్పు, నివారణ చర్యలపై కార్మికులకు అవగాహన కల్పించాలి.
పీజీఆర్‌ఎస్‌కు 211 అర్జీలు
రాజమహేంద్రవరం సిటీ: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 211 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. వీటిని నిర్ణీత గడువులోగా అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యతతో పరిష్కరించాలని ఈ సందర్భంగా జేసీ అన్నారు. ఒకసారి వచ్చిన అర్జీలు తిరిగి రాకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శాఖ ఆధ్వర్యాన ముగ్గురికి క్యంపూటర్లు అందజేశారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు
29 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో 29 మంది ఫిర్యాదులు సమర్పించారు. వారి నుంచి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (శాంతిభద్రతలు) అల్లూరి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా నగరంలో సోమవారం నిర్వహించిన ర్యాలీని స్థానిక వై జంక్షన్ వద్ద ఆమె ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 2023లో 109, ఈ ఏడాది 77 గ్రామ పంచాయతీలు సిల్వర్ మెడల్‌కు ఎంపికయ్యాయని తెలిపారు. వరుసగా మూడో సంవత్సరం కూడా 77 పంచాయతీలు నామినేషన్‌కు వెళ్తే గోల్డ్ మెడల్ సాధిస్తాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు కూడా ప్రసంగించారు. అనంతరం జిల్లాలోని 106 గ్రామ పంచాయతీల కార్యదర్శులకు టీబీ ముక్త అవార్డులను జాయింట్ కలెక్టర్, జిల్లా అదనపు వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ఎన్.వసుధర చేతుల మీదుగా అందజేశారు. తొలుత కలెక్టర్ ప్రశాంతి తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో పలువురు పంచాయతీ కార్యదర్శులు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి
వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి
వడగాడ్పుల నుంచి రక్షణ చర్యలు చేపట్టాలి
Comments
Please login to add a commentAdd a comment