వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం
● కిలో గరిష్ట ధర రూ.290
● దేవరపల్లిలో వేలాన్ని
ప్రారంభించిన ఈడీ విశ్వశ్రీ
దేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల్లో 2024–25 పంట కాలానికి గాను పొగాకు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో కొనుగోళ్లను పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ ప్రారంభించారు. తొలుత వేలం కేంద్రంలో ఆమె పూజలు నిర్వహించి, ఉదయం 10.54 గంటలకు ఈ–వేలం విధానంలో కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. తొలి రోజు ఉత్తర తేలిక నేలల (ఎన్‌ఎల్‌ఎస్) పొగాకు 18 బేళ్లతో పాటు, తొర్రేడు ప్రాంతం నుంచి సదరన్ బ్లాక్ సాయిల్ (ఎస్‌బీఎస్) పొగాకు బేళ్లను కూడా రైతులు అమ్మకానికి తీసుకు వచ్చారు. ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు కిలో గరిష్ట ధర రూ.290, ఎస్‌బీఎస్ పొగాకు రూ.280 చొప్పున పలికాయి. ట్రేడర్లు గత ఏడాది ప్రారంభ ధర కంటే కిలోకు అదనంగా రూ.50 పెంచి మరీ కొనుగోలు చేశారు. 2023–24 సీజన్‌లో కిలో ప్రారంభ ధర రూ.240 పలకగా, అమ్మకాల ముగింపు నాటికి రూ.410కు పెరిగింది. ఈడీ విశ్వశ్రీ అధికారులను అడిగి పొగాకు వేలం విధానం తెలుసుకున్నారు. పొగాకు నాణ్యతను పరిశీలించారు. కార్యక్రమంలో బోర్డు విస్తరణాధికారి దామోదర్, రీజినల్ మేనేజర్ జీఎల్‌కే ప్రసాద్, వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత, పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్, వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాట్రు వీర వెంకట సత్యనారాయణ, గౌరవ సలహాదారు నరహరిశెట్టి రాజేంద్రబాబు, కార్యదర్శి దుద్దుపూడి హరిబాబు, రైతులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, పలువురు మహిళా రైతులు, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment