వెంకన్న రథానికి రూ.లక్ష అందజేత
అమలాపురం టౌన్: అమలాపురం వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాల్లో ఊరేగే రథానికి రంగులు, మరమ్మతుల కోసం రాజమహేంద్రవరానికి చెందిన మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామమోహనరావు కుమారులు రాజా, గణేష్ రూ.లక్ష సమకూర్చారు. ఈ మొత్తాన్ని జక్కంపూడి గణేష్ బంధువు స్థానిక వెంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉత్సవ కమిటీ చైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న, కమిటీ సభ్యుడు మోకా వెంకట సుబ్బారావుకు మంగళవారం అందజేశారు. రామోమోహనరావు భార్య జక్కంపూడి విజయలక్ష్మి, కుమారులు రాజా (మాజీ ఎమ్మెల్యే), గణేష్‌లకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
వెంకన్న కల్యాణానికి
కుంకుమ భరిణల అందజేత
ఏప్రిల్ 7న జరగనున్న వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవాలను వీక్షించేందుకు ప్రత్యేక టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు 350 కుంకుమ భరిణలు, 350 జాకెట్ ముక్కలను మెట్రో కెమ్ కంపెనీల అధినేత డాక్టర్ నందెపు వెంకటేశ్వరరావు సమకూర్చారు.డాక్టర్ వెంకటేశ్వరరావుకు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
28న రేషన్
బియ్యానికి వేలం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)/దేవరపల్లి: జిల్లాలోని ఆరు కేసులలో సీజ్ చేసిన 47.274 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యానికి ఈ నెల 28న బహిరంగ వేలం వేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు గోపాలపురంలోని మండల స్థాయి స్టాక్ పాయింట్ వద్ద ఈ వేలం నిర్వహిస్తామన్నారు. కిలో బియ్యం ధర రూ.25గా నిర్ణయించామన్నారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు జీఎస్‌టీ లైసెన్స్ కలిగి ఉండాలని, ముందుగా రూ.2 లక్షల ధరావత్తును ‘జాయింట్ కలెక్టర్, తూర్పు గోదావరి జిల్లా’ పేరిట డీడీ రూపంలో చెల్లించి, వేలంలో పాల్గొనాలని పేర్కొన్నారు. పాట వాయిదాకు, నిలుపుదలకు లేదా పూర్తిగా రద్దు చేయడానికి జిల్లా యంత్రాంగానికి అధికారాలున్నాయని తెలిపారు.
యూత్ పార్లమెంట్‌కు ఎంపిక
ఏలేశ్వరం: రాష్ట్ర స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2025కు ఏలేశ్వరానికి చెందిన సాయిప్రదీప్ ఎంపికయ్యాడు. ఏపీ అసెంబ్లీలో జరిగే యూత్ పార్లమెంట్‌కు శ్రీకాకుళం జిల్లా నుంచి అతడు ప్రాతినిధ్యం వహిస్తాడు. కోస్తాంధ్ర నుంచి పలువురు విద్యార్థులు ఒక నిమిషం వీడియోను మై భారత్ యాప్‌లో అప్‌లోడ్ చేశారు. దీని ఆధారంగా విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 24న యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఎంపిక ప్రక్రియ జరిగింది. వీరిలో సాయిప్రదీప్‌ను టాప్–10లో ఒకరిగా ఎంపిక చేశారు. భారత రాజ్యాంగ వ్యవస్థపై ఈ నెల 28న అసెంబ్లీలో స్పీకర్ ముందు సాయిప్రదీప్ ప్రసంగించనున్నాడు. అతడిని పలువురు అభినందించారు.
హుండీల ద్వారా స్వామి ఆదాయం రూ.26,48,813
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారికి భక్తుల నుంచి వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.26,48,813 ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకూ 39 రోజులకు గాను అధికారులు నిర్వహించిన హుండీల లెక్కింపులలో పై ఆదాయం స్వామికి వచ్చింది. ఎండోమెంట్స్ ఇన్‌స్పెక్టర్ జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో ఆల య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు లెక్కింపు నిర్వహించారు. మెయిన్ హుండీల ద్వారా రూ.25,86,985, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.20,676, అన్నదానం హుండీ ద్వారా రూ.41,152 ఆదాయం వచ్చినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సర్పంచ్‌లు కొండా జాన్‌బాబు, ఒడుగు శ్రీనివాస్, ఎంపీటీసీ బైరా నాగరాజు పాల్గొన్నారు.
బీసీ సాధికార సంస్థ
అధ్యక్షుడిగా గుబ్బల
మలికిపురం: బీసీ సాధికార సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిగా మలికిపురంనకు చెందిన గుబ్బల సత్యనారాయణ (బాబ్జి) నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు కె.కొండలరావు చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. సమాఖ్యను సమర్థంగా నడిపిస్తానని ఈ సందర్భంగా బాబ్జి మంగళవారం మలికిపురంలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment