కదం తొక్కిన కోకో రైతులు
కొవ్వూరు: కోకో గింజల కొనుగోలు, గిట్టుబాటు ధరలపై నెల రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. కోకో గింజలను ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ కోకో కాయలు, గింజలు పట్టుకుని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట నిలబడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కోకో రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ, కంపెనీలు సిండికేట్‌గా మారి కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రైతుల వద్ద ఉన్న కోకో పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు మాట్లాడినప్పటికీ కంపెనీలు నిర్లక్ష్య ధోరణి చూపుతున్నాయని అన్నారు. అన్ సీజన్‌లో కోకో పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నారన్నారు. మరోవైపు కంపెనీలు రోజురోజుకూ ధర తగ్గించేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కిలో కోకో గింజల ధర రూ.650 ఉండగా నేడు రూ.550 నుంచి రూ.500కు పడిపోయిందని చెప్పారు. అన్ సీజన్‌లో కిలో రూ.200 నుంచి రూ.240కే కొనుగోలు చేస్తున్నారని అన్నారు. కిలో కోకో గింజలకు రూ.900 చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వం ద్వారా వెంటనే కొనుగోలు చేయాలని, ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలని, విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేయాలని, ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీలు అందించి, రైతులను ఆదుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అనంతరం ఆర్‌డీఓ రాణి సుస్మితకు రైతు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఉప్పల కాశీ, నాయుడు లక్ష్మణరావు, ఉండవల్లి కృష్ణారావు, జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ కంపెనీలు కొనుగోలు
చేయకపోవడంపై నిరసన
ఫ తక్షణం ప్రభుత్వం కొనాలని విన్నపం
ఫ కిలోకు రూ.900 ఇవ్వాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment