స్థానిక సంస్థలకు రేపు ఉప ఎన్నికలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని 12 గ్రామాల్లో ఉప సర్పంచ్, బిక్కవోలు ఎంపీపీ, పెరవలి, రంగంపేట మండలాల్లో ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికలు గురువారం నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఈ ఎన్నికలను సజావుగాచ నిష్పక్షపాతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లేశ్వరం (గోకవరం), పెనకనమెట్ట (కొవ్వూరు), పాత తుంగపాడు (రాజానగరం), కొవ్వూరుపాడు, వెంకటాయపాలెం (గోపాలపురం), తాళ్లపూడి, లక్ష్మీనరసాపురం (అనపర్తి), మర్రిపూడి (రంగంపేట), మురమండ (కడియం), మునికూడలి (సీతానగరం), ఉండ్రాజవరం గ్రామాల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఏదైనా కారణంతో ఎన్నికల అధికారులు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించలేకుంటే తదుపరి రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించి జరపాలని స్పష్టం చేశారు. ఎన్నిక నిలిపివేస్తే దానికి కారణాలను లిఖిత పూర్వకంగా నమోదు చేసి, మరో రోజు నిర్వహించేందుకు అనుమతించవచ్చని తెలిపారు. ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు పకడ్బందీగా ఉండాలని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికకు ఒక్క సభ్యుడిని మాత్రమే ప్రతిపాదించాలని, మరో సభ్యుడు మద్దతు ఇవ్వాలని తెలిపారు. ప్రతిపాదించిన, మద్దతు పొందిన అభ్యర్థులందరి పేర్లు సమావేశ అధ్యక్షుడు చదివి వినిపించాలన్నారు. పోటీ చేస్తున్న వారు అదే రోజు ఉదయం 10 గంటల్లోగా నామినేషన్లు సమర్పించాలన్నారు. ఉపసంహరణకు అరగంట సమయం ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల్లోగా పరిశీలన పూర్తి చేసి, అభ్యర్థుల జాబితా ప్రకటించాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎన్నిక నిర్వహించాలన్నారు. ఒక్క అభ్యర్థి మాత్రమే వస్తే వారే ఎన్నికై నట్లు ప్రకటించాలన్నారు. ఎన్నిక జరిగితే ప్రతి అభ్యర్థి వచ్చిన ఓట్లను లెక్కించి, సమావేశ అధ్యక్షుడు ప్రకటించాలని జేసీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment