పాస్టర్‌ మృతిపై అనుమానాలు | - | Sakshi
Sakshi News home page

పాస్టర్‌ మృతిపై అనుమానాలు

Published Wed, Mar 26 2025 12:40 AM | Last Updated on Wed, Mar 26 2025 12:38 AM

పాస్ట

పాస్టర్‌ మృతిపై అనుమానాలు

26 ఆర్జేసీ 103ఎ–270083:

అది రోడ్డు ప్రమాదం కాదు హత్య అని

క్రైస్తవ సంఘాల ఆరోపణ

రాజమహేంద్రవరం చేరుకున్న రాష్ట్రంలోని

ప్రముఖ పాస్టర్లు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/రాజానగరం: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే, ఆయన రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, హత్య చేశారంటూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్‌చెరువు నుంచి గామన్‌ బ్రిడ్జికి వెళ్లే రోడ్డులో నయరా పెట్రోలు బంకు ఎదురుగా కొంతమూరు సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్‌ పగడాల మృతి చెందారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన వ్యక్తిగత పనులపై ఇటీవల రాజమహేంద్రవం వచ్చారు. ఎన్‌ఫీల్డ్‌ బైకుపై వెళ్తున్న ఆయనను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో, ఆయన బైకుతో సహా రోడ్డు పక్కన ఉన్న తుప్పల్లో పడి, అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం స్థానికుల ద్వారా మంగళవారం తెలుసుకున్న రాజమహేంద్రవరంలోని బొమ్మూరుకు చెందిన అతని సన్నిహితుడు జనగామ రోహన్‌ ఉదయం 11 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ ఎంపీలు మార్గాని భరత్‌రామ్‌, జీవీ హర్షకుమార్‌, పాస్టర్లు సబ్బెళ్ల విజయప్రసాద్‌రెడ్డి, జాన్‌వెస్లీ, స్థానిక రాజకీయ నాయకులు అక్కడకు చేరుకుని, ప్రవీణ్‌కుమార్‌ మృతిపై లోతైన దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు.

న్యాయం చేయాలంటున్న క్రైస్తవ సంఘాలు

పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మృతి చెందిన విషయం తెలిసిన రాష్ట్రంలోని క్రైస్తవ సంఘాల సభ్యులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. పాస్టర్లు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆసుపత్రి, పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయంటూ క్రైస్తవ సంఘాలు ఆరోపించాయి. పాస్టర్‌ సబ్బెళ్ల విజయప్రసాద్‌రెడ్డి, పాస్టర్‌ జాన్‌వెస్లీ మాట్లాడుతూ రక్షణ టీవీ వేదికగా ఎన్నో డిబేట్‌లు నిర్వహించిన ప్రవీణ్‌కుమార్‌ మృతి అనుమానాస్పదంగా ఉందన్నారు. ఆయన తలకు బలమైన గాయాలున్నాయన్నారు. దీనిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని పోలీసులను కోరామన్నారు. తొలుత యాక్సిడెంట్‌ అని చెప్పారని, అయితే ప్రవీణ్‌ తలకు తీవ్రమైన గాయాలున్నాయని, దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయాలని పోలీసులను కోరామన్నారు. ప్రమాద స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని, మా అనుమానాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించాలన్నారు. ప్రవీణ్‌కుమార్‌ కో ఆర్డినేటర్‌ రాజమహేంద్రవరంలో ఉన్నారని, ఆయన సోమవారం నుంచి ఫోన్‌ చేస్తుంటే లిఫ్ట్‌ చేయలేదన్నారు. ఇదిలావుండగా పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ప్రభుత్వాసుపత్రి వద్ద మాట్లాడుతున్న పాస్టర్‌ సబ్బెళ్ల

విజయప్రసాద్‌రెడ్డి

నిజానిజాలు వెలికితీస్తాం

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై ఎటువంటి అపోహలు, అసత్యాలు, సృష్టించవద్దని జిల్లా ఎస్పీ డి.నరసింహాకిశోర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పాస్టర్‌ మృతిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ కొనసాగిస్తున్నామన్నారు. త్వరలోనే నిజానిజాలను వెలికి తీస్తామన్నారు. అసత్య ప్రచారాలు చేసి, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు చేపడతామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పాస్టర్‌ మృతిపై అనుమానాలు 1
1/1

పాస్టర్‌ మృతిపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement