అమ్మ, నాన్నకు ప్రేమతో..
ఫ రూ.10 లక్షలతో తల్లిదండ్రులకు ఆరాధ్య మందిరం
ఫ ప్రేమ చాటుకున్న తనయుడు
ఫ నేడు తల్లి ప్రథమ వర్ధంతి
ఫ మందిరం, విగ్రహాల ఆవిష్కరణ
కొత్తపేట: అమ్మ కురిపించే ఆప్యాయత, అనురాగం, ఆనందం హృదయానికి గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. నాన్నలోని హుందాతనం, సంతానంపై కనపడకుండా కడుపులో దాచుకున్న ప్రేమ ఈ ప్రపంచాన్నే మరిపింపజేస్తాయి. అటువంటి తల్లిదండ్రులకు ఏకంగా ఆరాధ్య మందిరమే నిర్మించారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం బొరుసువారిసావరం గ్రామానికి చెందిన బొరుసు వెంకట ఉదయ భాస్కర్. తపాలా శాఖలో పని చేసిన చంద్రరావు – పూర్ణచంద్ర కళావతి దంపతుల కుమారుడైన భాస్కర్.. ప్రముఖ జాతీయ స్థాయి నిర్మాణ సంస్థలో కీలక స్థానంలో పని చేశారు. ఆ కంపెనీలో అనేక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, ఆయా కుటుంబాలకు కూడా ఓ దారి చూపారు. భాస్కర్ తండ్రి 2000 సంవత్సరంలో మృతి చెందారు. అనంతరం భాస్కర్ తన తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమె స్ఫూర్తి, ప్రోత్సాహం, సూచనల మేరకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా బొరుసువారి సావరం వద్ద కౌశిక తీరాన కనకదుర్గాదేవి గుడిని రూ.కోటితో పునర్నిర్మించారు. కొత్తపేట గ్రామ పరిధిలోని తొలి దుర్గాదేవి గుడి ఇదే కావడం విశేషం. ప్రతి నెలా పౌర్ణమి నాడు మహిళలతో ఇక్కడ సామూహిక కుంకుమ పూజలు, అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఆ ఆలయానికి సమీపాన బొబ్బర్లంక – అమలాపురం ప్రధాన పంట కాలువ పరీవాహక ప్రాంతంలో ఉద్యానవనం, గ్రామస్తుల సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి రూ.వేలు, రూ.లక్షల్లో ఆర్థిక సహాయం అందించారు. అనేక దానధర్మాలు చేశారు.. చేస్తున్నారు. భాస్కర్ తల్లి కళావతి గత ఏడాది ఏప్రిల్ 5న కాలం చేశారు. అనంతరం తల్లిదండ్రుల స్మృతిలో భాస్కర్ తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరణించిన అనంతరం కూడా తల్లిదండ్రులు తన కళ్ల ముందే ఉండాలని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న తన వ్యవసాయ క్షేత్రం, ఫామ్ హౌస్ ప్రాంగణంలో సుమారు రూ.10 లక్షల వ్యయంతో తల్లిదండ్రులు చంద్రరావు – పూర్ణచంద్రకళావతి కాంస్య విగ్రహాలు నెలకొల్పారు. వాటికి గ్రానైట్ రాయితో అందమైన మందిరం నిర్మించారు. జీవకళ ఉట్టిపడేలా ఈ విగ్రహాలను స్థానిక ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తీర్చిదిద్దారు. తల్లి కళావతి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ నెల 26న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్య క్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అమ్మ, నాన్నకు ప్రేమతో..
Comments
Please login to add a commentAdd a comment