
కరోనా వైరస్ మహమ్మారి పర్యవసానాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా వుంటాయని కొన్నాళ్లుగా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూనే వున్నారు. తాజా రిజర్వ్‌బ్యాంక్(ఆర్‌బీఐ) వార్షిక నివేదిక సైతం దాన్నే ధ్రువీ కరించింది. దీని తాకిడి ఆర్థిక రంగంపై ఎలా వుండబోతున్నదో ఆ నివేదిక నిర్దిష్టమైన అంచనా లివ్వకపోయినా భవిష్యత్తు ఎలా వుంటుందో స్థూలంగా తెలియజేసింది. విస్తృతమైన, లోతైన సంస్క రణలు తీసుకురానట్టయితే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటం కష్టమని చెప్పింది. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ఏటా జూన్‌తో మొదలై మరుసటి సంవత్సరం జూలై వరకూ వున్న ఆర్థిక చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. 2019–20 సంవత్సరానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం ఆర్‌బీఐ ఆదాయం రూ. 41 లక్షల కోట్ల నుంచి 53.3 లక్షల కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 28.97 శాతం. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులు 18.4 శాతం, 27.3 శాతం చొప్పున పెరిగాయని నివేదిక వివరించింది. అయితే ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం కరోనా మహమ్మారి విరుచుకుపడటానికి ముందునాటివని అను కోవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన లాక్‌డౌన్ వల్ల దేశంలో సమస్త కార్యకలాపాలూ స్తంభించి పోయాయి. అన్ని రంగాలూ తీవ్ర నష్టాలు చవిచూశాయి.
మే నెలలో లాక్‌డౌన్ సడలింపులు మొదలు కావడం, కొన్ని రంగాల కార్యకలాపాలకు పాక్షికంగా అనుమతి లభించడంతో క్రమేపీ అంతా చక్కబడొచ్చని ఆశించినవారు కూడా లేకపోలేదు. కానీ స్థానికంగా వున్న పరిస్థితుల కారణంగా పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు యధావిధిగా కొనసాగాయి. సడలింపులు అమలైనచోట్ల కూడా ఎన్నో పరి మితులు అమలయ్యాయి. కనుకనే మే, జూన్ నెలల్లో ఆశించిన రీతిలో వాణిజ్యరంగం మెరుగు కాలేదు. ఇందుకు కారణం సాధారణ ప్రజానీకంలో రేపటిపై ముసురుకున్న సందేహాలే. ఒకపక్క కరోనా తీవ్రత సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశాలు కనబడకపోవడం, లాక్‌డౌన్ సమయంలో ఎదుర్కొన్న అవస్థలు వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. కనుకనే వినియోగం గణనీయంగా పడి పోయింది. ఉపాధి దెబ్బతినడం, జీతాలు తగ్గడం వంటి భయాలున్నప్పుడు తప్పనిసరి అవసరాలకు తప్ప ఇతరత్రా ఖర్చులకు ఎవరూ సిద్ధపడలేరు. మార్కెట్‌లో వినియోగం సరిగా లేదనుకున్నప్పుడు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో మదుపు చేయదల్చుకున్నవారు వెనక్కి తగ్గుతారు. ఇప్పుడు జరిగింది అదే. ఈ పరిస్థితిని ఆర్‌బీఐ సక్రమంగానే చూపింది. ఇది 2020–21 రెండో త్రైమాసికం వరకూ కొనసాగే అవకాశం వుందని అంచనా వేసింది.
కరోనా ప్రభావంతో మనం మాత్రమే కాదు... ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనుకనే ఆర్‌బీఐ వార్షిక నివేదిక ఏం చెబుతుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. ఊహించినట్టే అది నిరాశాజనకమైన అంచనాలే ఇచ్చింది. 2008నాటి ఆర్థిక మాంద్యంతో ప్రస్తుత స్థితిని పోల్చలేమని, అప్పట్లో అంతర్జాతీయంగా ఆస్తుల విలువలు మాత్రమే క్షీణించాయని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభం మొత్తం మానవాళిపై, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూప గలదని వివరించింది. కేంద్రం ఆర్థిక రంగంలో భారీ సంస్కరణలు తెస్తేనే పరిస్థితి మెరుగవుతుందని సూచించింది. జీఎస్‌టీని సరళతరం చేయడం మొదలుకొని ఉక్కు, బొగ్గు, విద్యుత్, రైల్వే తదితర రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలని ప్రతిపాదించింది. అయితే ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ప్రైవేటీకరణ ఆచరణ సాధ్యమేనా? అందుకు బదులు ఉద్యోగ కల్పన కోసం భిన్నరంగాలకు పెద్ద యెత్తున నేరుగా సాయం అందజేయగలిగితే పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజు కోవడానికి కేంద్రం ఇప్పటికే రూ. 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించినమాట వాస్తవమే. ఆ ప్యాకేజీ వివరాలను దశలవారీగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే ఆ పేరిట తీసుకున్న చర్యల్లో అత్యధికం బ్యాంకు రుణాల మంజూరే. ఉదాహరణకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల్లో వంద కోట్ల టర్నోవర్ దాటిన యూనిట్లకు ఏ హామీ చూపకుండా నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సౌకర్యం కల్పించారు.
ఈ రుణాలు నాలుగేళ్ల వ్యవధిలో చెల్లించేందుకు, తొలి ఏడాది అసలు, వడ్డీ చెల్లింపులపై మినహాయింపులిచ్చే వెసులుబాటు ఇచ్చారు. అలాగే వ్యవసాయం, గృహనిర్మాణం, రియల్‌ఎస్టేట్, నాన్ ఫైనాన్సింగ్ రంగాలకు ఊతమిచ్చేందుకు... నిరుపేదలు, వలస కార్మికులు తదితరులకు కూడా వివిధ చర్యలు ప్రకటించారు. కానీ మార్కెట్‌లో వినియోగం బాగుందనుకుంటేనే ఎవరైనా ముందుకు కదులుతారు. ఆ పరిస్థితి లేదనుకున్నప్పుడుబ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, పెట్టుబడులు పెట్టే సాహసం ఎవరూ చేయరు. వినియోగం పెరగాలంటే ప్రజల చేతుల్లో ఏదో మేర డబ్బుండాలి. ఆ పరిస్థితి లేకపోబట్టే రుణాలు తీసుకోవడానికి అటు ఎంఎస్‌ఎంఈలు జంకితే, ఎలాంటి హామీ లేకుండా ఇవ్వడానికి బ్యాంకులు సందేహించాయి. మే నెలలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే జూలై నాటికి బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు రూ. 1.20 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలి పింది. వాస్తవానికి ఈ మంజూరైన రుణాల్లో గత నెల వరకూ తీసుకున్న మొత్తం దాదాపు రూ. 62,000 కోట్లు మాత్రమే.
ఆర్‌బీఐ లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం మెరుగ్గా వుంది. ఉపాధి హామీ పథకం, గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్ వంటివి అందుకు దోహద పడ్డాయి. పట్టణ ప్రాంతాల్లో అలా నిరుపేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలు పెద్దగా లేవు. దానికి తోడు రవాణా, ఆతిథ్య రంగం, వినోదం వగైరా రంగాలు నిలిచిపోవడంతో వాటిపై ఆధారపడి జీవనం సాగించే లక్షలాదిమంది పరిస్థితి అయోమయంలో పడింది. ఆ రంగాల్లో గణనీయమైన సంఖ్యలో ఉపాధి అవకాశాలు మాయమయ్యాయి. కేంద్రం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని, పరి స్థితిని సమీక్షించి భిన్న రంగాల్లో దెబ్బతిన్నవారిని ఆదుకోవడానికి మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిం చడం అవసరం.